
బర్మింగ్‌హామ్: ఆటలు ముగిశాయి. వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు స్టేడియంపై విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా మొదలైన బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ ఆట్టహాసంగా ముగిశాయి. భయపెట్టే కోవిడ్ కేసులు లేకుండా ముచ్చటపరిచే రికార్డులతో అలరించిన ఆటల షోకు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున తెరపడింది. 72 దేశాలకు చెందిన 4500 పైచిలుకు అథ్లెట్లు తమ ప్రదర్శనతో కామన్వెల్త్‌కు కొత్త శోభ తెచ్చారు.
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ బర్మింగ్‌హామ్ ఆటలకు తెరపడిందని లాంఛనంగా ప్రకటించారు. 2026 ఆతిథ్య వేదిక విక్టోరియా (ఆస్ట్రేలియా)లో కలుద్దామని అన్నారు. భారతీయ భాంగ్రా స్టేడియాన్ని ఊపేసింది. భారత సంతతికి చెందిన సుప్రసిద్ధ గేయరచయిత, గాయకుడు ‘అపాచి ఇండియన్’గా ఖ్యాతి పొందిన స్టీవెన్ కపూర్ ‘భాంగ్రా’ పాటలను హుషారెత్తించే గళంతో పాడాడు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ , టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు.