
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిన్న (ఏప్రిల్ 21) తమ సెంట్రల్ కాంట్రాక్ట్ (2024-25) ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ కేటగిరీలో చోటు దక్కించుకున్నారు.
నిబంధనల ప్రకారం ఓ ఆటగాడికి బీసీసీఐ ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించాలంటే అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయ్యుండాలి. అయితే రోహిత్, విరాట్, జడేజా గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కేవలం వన్డేలు, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
అయినా వారికి ఏ ప్లస్ కాంట్రాక్ట్ లభించింది. దీనిపై నిన్నటి నుంచి క్రికెట్ అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా వారిని ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో కొనసాగిస్తున్నారని సోషల్‌మీడియా వేదికగా డిస్కషన్స్ నడిచాయి. ఈ అంశంపై బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి తాజాగా స్పందించాడు.
రోహిత్, విరాట్, జడేజా ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు కానప్పటికీ ఎందుకు ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారన్న విషయంపై వివరణ ఇచ్చాడు.
2024-25 సంవత్సరాని గానూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ వ్యవధి అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉంటుంది. అయితే దీని అసెస్‌మెంట్ సంవత్సరం మాత్రం అక్టోబర్ 1, 2023 నుండి సెప్టెంబర్ 30, 2024 మధ్యలో ఉంటుంది. ఆ వ్యవధిలో కోహ్లీ, రోహిత్ , జడేజా అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులుగా ఉన్నారు.
జూన్ 2024లో భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆ ముగ్గురు టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ సాంకేతికత ప్రకారం.. రోహిత్, విరాట్, జడేజా ఏ ప్లస్ కేటగిరీలో ఉన్నారని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు.
ఇదిలా ఉంటే, నిన్న ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో మొత్తం 34 మంది చోటు దక్కించుకున్నారు. వీరిలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.
ఈ ఏడాది కొత్తగా ఏడుగురు (ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా) సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించకున్నారు. శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ తమ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. రిషబ్ పంత్‌కు బి నుంచి ఏ కేటగిరీకి ప్రమోషన్ లభించింది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.
ఏ ప్లస్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.
గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.
గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.
గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.
