
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని రెండోసారి గెలుచుకోవాలనే భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. గతంలో 2013లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హామ్ లో జరిగిన ఫైనల్ లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత్ జట్టు ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయసాధించి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది.
మళ్ళీ ఇప్పటి దాకా భారత్ ఈ ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. 2017 జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు భారత్ పై 180 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ట్రోఫీ ని దక్కించుకుంది. మళ్ళీ ఈ ట్రోఫీ ని సాధించాలంటే భారత్ తన సత్తా చావాల్సిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్, దుబాయ్ లలో ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంతో ప్రాముఖ్యముంది.
ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేని భారత్ జట్టు ఫిబ్రవరి 20వ తేదీన దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. తర్వాత ఫిబ్రవరి 23న ఇదే వేదిక పైన తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని ఎదుర్కొంటుంది. ఆ తర్వాత మెన్ ఇన్ బ్లూ మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఇంగ్లండ్‌పై స్వదేశంలో భారత్ ఇటీవల 3-0 తేడాతో వన్డే సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో అభిమానుల్లోనూ, జట్టు ఆటగాళ్లలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ గతేడాది వెస్టిండీస్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో ఆడిన రీతి లో మళ్ళీ రాణించి మరో ఐసీసీ ట్రోఫీ ని భారత్ కి తెస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రోహిత్, కోహ్లి, జడేజా లకు చివరి అవకాశం?
గత సంవత్సరం టీ 20 ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ జట్టు ముంబై వాంఖడే స్టేడియం సమీపంలోని వీధుల్లో ఓపెన్ బస్సు లో పరేడ్ చేసింది. మళ్ళీ అలాంటి దృశ్యం రిపీట్ కావాలంటే కెప్టెన్ రోహిత్, కోహ్లీ మళ్ళీ తమ మునుపటి ఫామ్ ని కనిపించడం తప్పనిసరి.
అయితే ఆస్ట్రేలియా పర్యటన లో ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇంగ్లాండ్ సిరీస్ లో పరుగులు సాధించి ఆత్మవిశ్వాసం తో ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన కటక్ వన్డేలో రోహిత్ 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. కోహ్లీ అహ్మదాబాద్‌లో జరిగిన చివరి వన్డే లో తన 73వ అర్ధ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇది వారిద్దరికీ తాత్కాలిక ఉపశమనం కలిగించి ఉండవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో ఈ అగ్రశ్రేణి క్రికెటర్లు ఇద్దరూ తమ మునుపటి ఫామ్ ని చూపించక తప్పదు.
వన్డే చరిత్రలో 14,000 పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లీకి 37 పరుగులు అవసరం, మరో వైపు 11,000 పరుగులు పూర్తి చేసిన పదో బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు రోహిత్‌కు కేవలం 12 పరుగులు మాత్రమే అవసరం. కానీ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవకుండా వీరిద్దరూ ఈ వ్యక్తిగత రికార్డులు సాధించినా పెద్దగా ప్రయోజనం ఉండదు.
భవిష్యత్తు పై చర్చ
ఐసిసి మెగా ఈవెంట్‌కు ముందు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు పై చర్చ జరుగుతోంది. గత సంవత్సరం టి 20 ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఈ ముగ్గురూ ఇప్పటికే అంతర్జాతీయ టి 20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలి ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఇక రిటైర్మెంట్ ప్రకటించవచ్చని పుకార్లు వ్యాపించాయి.
అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినట్లయితే ఈ ముగ్గురు సీనియర్లు ఆటగాళ్లు మరికొంత కాలం ఆడే అవకాశం ఉందని, భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. "ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసీసీ టోర్నమెంట్ మరో రెండు, మూడు ఏళ్ళ వరకు లేదు.
వచ్చే ఏడాది టి 20 ప్రపంచ కప్ ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఇప్పటికే టి 20ల నుంచి రిటైర్ అయ్యారు. ఇక 2027 లో జరిగే వన్డే ప్రపంచ కప్ కి చాల కాలం ఉంది. అప్పటి దాకా వీరు ముగ్గురూ వన్డే క్రికెట్ లో కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రోహిత్, విరాట్, జడేజా లకు ఇదే చివరి ఐసీసీ టోర్నమెంట్ కావచ్చని, చోప్రా వ్యాఖ్యానించాడు.
యువ ఆటగాళ్ల కు అద్భుత అవకాశం
వన్డే వైస్ కెప్టెన్‌గా యువ బ్యాటర్ శుభమాన్ గిల్‌కు పెద్ద ప్రమోషన్ వచ్చింది. పైగా ఈ ఫార్మాట్‌లో దాదాపు 61 సగటు ఉన్న ఈ బ్యాట్స్‌మన్ ఛాంపియన్స్ ట్రోఫీలో విజృభించి తన సత్తా చాటాలని ఎంతో ఆసక్తి గా ఉన్నాడు. గాయం కారణంగా బుమ్రా లేకపోయిన కారణంగా అర్ష్‌దీప్ సింగ్ , హర్షిత్ రాణా వంటి యువ బౌలర్లకు ఇది అద్భుత అవకాశం.
ఈ నేపధ్యం లో గిల్, శ్రేయాస్ అయ్యర్, కె ఎల్ రాహుల్ వంటి బ్యాటర్, అర్ష్‌దీప్ సింగ్, రాణా వంటి యువ ఆటగాళ్లకి అంతర్జాతీయ వేదిక పై తమ సత్తా చాటేందుకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఒక అద్భుత అవకాశంగా కనిపిస్తోంది. మరి ఈ యువ ఆటగాళ్లు రాణించి భారత్ కి మరో ఐసీసీ ట్రోఫీ తెస్తారేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment