
ముక్కోణపు వన్డే టోర్నీలో నేడు తొలి మ్యాచ్
కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత జట్టు తలపడుతోంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొంటున్న ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించాలని భారత్ భావిస్తోంది.
ముక్కోణపు టోర్నీ మొదటి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా చూస్తోంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఓపెనర్ షఫాలీ వర్మను సెలెక్టర్లు ఈ సిరీస్‌కు కూడా పరిగణనలోకి తీసుకోలేదు.
గత రెండు సిరీస్‌ల్లోనూ చక్కటి విజయాలు సాధించిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముక్కోణపు టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌పై సిరీస్‌లు గెలిచిన టీమిండియా వరుసగా ఆరు వన్డేలు నెగ్గి శ్రీలంకలో అడుగుపెట్టింది.
కాశ్వి గౌతమ్ అరంగేట్రం!
బ్యాటింగ్‌లో బలంగా ఉన్న టీమిండియాకు పేస్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ బౌలర్లు రేణుక సింగ్, పూజ వస్త్రకర్, టిటాస్ సాధు గాయాలతో సతమతమవుతుండటంతో... యంగ్ ప్లేయర్లపై అధిక భారం పడనుంది. అండర్–19 మహిళల ప్రపంచకప్‌లో సత్తాచాటిన కాశ్వి గౌతమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయమే.
ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కాశ్వి 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టింది. హైదరాబాద్ మీడియం పేసర్ అరుంధతి రెడ్డి, కాశ్వి తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే. మీడియం పేస్ ఆల్‌రౌండర్ అమన్‌జ్యోత్ కౌర్ కూడా అందుబాటులో ఉంది.
అయితే శ్రీలంక పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యమే ఎక్కువ. ఆ కోణంలోనూ భారత్ మెరుగ్గా ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, స్నేహ్ రాణాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీచరణి జట్టులో ఉన్నారు. మరోవైపు శ్రీలంక జట్టు కెపె్టన్ చమరి ఆటపట్టుపై అధికంగా ఆధారపడుతోంది.