క్లీన్ స్వీప్ 'సిక్సర్'
శ్రీలంక గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇక్కడ జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒక్కసారి కూడా శ్రీలంక ఏ జట్టు చేతిలోనూ క్లీన్‌స్వీప్ కాలేదు. ఇప్పుడు తొలిసారిగా కోహ్లి సేన ఆ జట్టును వైట్‌వాష్ చేసింది. మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇదివరకే కోల్పోయిన లంకకు ఇది వరుసగా రెండో దెబ్బ. ఏకపక్షంగా జరిగిన చివరి వన్డేలోనూ భారత్ చెలరేగింది. కోహ్లి రెండో శతకంతో రాణించగా... భువనేశ్వర్ కెరీర్‌లో తొలిసారిగా ఐదు వికెట్లతో లంకను బెంబేలెత్తించాడు.
ఓవరాల్‌గా ఐదు వన్డేల సిరీస్‌లను భారత జట్టు 5–0తో క్లీన్‌స్వీప్ చేయడం ఇది ఆరోసారి కావడం విశేషం. గతంలో భారత్ స్వదేశంలో 2008లో ఇంగ్లండ్‌పై, 2010లో న్యూజిలాండ్‌పై, 2011లో ఇంగ్లండ్‌పై, 2013లో జింబాబ్వేలో జింబాబ్వేపై, 2014లో స్వదేశం లో శ్రీలంకపై 5–0తో సిరీస్‌లను సొంతం చేసుకుంది.
ఐదు వన్డేల సిరీస్‌ను ఆరోసారి క్లీన్‌స్వీప్ చేసిన భారత్
⇒ విరాట్ కోహ్లి 30వ శతకం
⇒ చివరి మ్యాచ్‌లోనూ శ్రీలంకపై భారీ విజయం
కొలంబో: నాలుగు వన్డేల్లో ఇప్పటిదాకా జరిగినట్టుగానే చివరి వన్డేలోనూ అదే ఫలితం పునరావృతమైంది. భారత్ ఎప్పటిలాగే గెలిచింది... శ్రీలంక ఎప్పటిలాగే ఓడింది. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా కోహ్లి సేనకు పోటీ ఇస్తారని భావించినా అలాంటి సంచలనానికి లంక తావీయలేదు. ముందుగా భువనేశ్వర్ (5/42) పేస్ దెబ్బకు కకావికలమైన ఆతిథ్య జట్టు ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి (116 బంతుల్లో 110 నాటౌట్; 9 ఫోర్లు) అజేయ శతకంతో కోలుకోలేకపోయింది. ఫలితంగా ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేదార్ జాదవ్ (73 బంతుల్లో 63; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా శ్రీలంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తిరిమన్నె (67; 3 ఫోర్లు, 1 సిక్స్), మాథ్యూస్ (55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించాడు. కెప్టెన్ ఉపుల్ తరంగ (34 బంతుల్లో 48; 9 ఫోర్లు) వేగంగా ఆడాడు.
బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లకు 239 పరుగులు చేసి నెగ్గింది. భారత జట్టు ఈ మ్యాచ్ కోసం ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ధావన్, రాహుల్, పాండ్యా, అక్షర్ స్థానంలో రహానే, కేదార్ జాదవ్, భువనేశ్వర్, చాహల్ ఆడారు. భువనేశ్వర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... బుమ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు లభించాయి. ఇరు జట్ల మధ్య ఏకైక టి20 మ్యాచ్ ఈనెల 6న (బుధవారం) జరుగుతుంది.
తిరిమన్నె, మాథ్యూస్ సెంచరీ భాగస్వామ్యం
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఈసారి కూడా శుభారంభం అందలేదు. మూడో ఓవర్‌లోనే డిక్‌వెలా (2)ను భువనేశ్వర్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. కొద్దిసేపటికే మునవీర (4)ను కూడా భువీనే అవుట్ చేశాడు. మరోవైపు దూకుడు మీదున్న తరంగను బుమ్రా బోల్తా కొట్టించాడు. దీంతో జట్టు 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ తిరిమన్నె, మాథ్యూస్ అద్భుతంగా ఆడి నాలుగో వికెట్‌కు 122 పరుగులు జోడించారు. 39వ ఓవర్‌లో భువీ బౌలింగ్‌లో తిరిమన్నె అవుటవ్వడంతో లంక ఇన్నింగ్స్ మళ్లీ తడబడింది. చివర్లో భారత బౌలర్ల విజృంభణకు లంక 53 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది.
కోహ్లి వరుసగా రెండోసారి...
తక్కువ స్కోరే అయినా భారత్ కూడా ప్రారంభంలో తడబడింది. సిరీస్‌లో తొలిసారిగా అవకాశం దక్కించుకున్న రహానే (5) విఫలమయ్యాడు. అటు వరుసగా రెండు సెంచరీలతో ఊపు మీదున్న రోహిత్ (16) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి, మనీశ్ పాండే (53 బంతుల్లో 36; 2 ఫోర్లు) కుదురుగా ఆడి మూడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. పాండే అవుటయ్యాక వచ్చిన కేదార్ జాదవ్ మెరుగైన ఆటతీరును కనబరిచాడు. 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక కోహ్లి 107 బంతుల్లో కెరీర్‌లో 30వ సెంచరీని అందుకున్నాడు. విజయానికి మరో రెండు పరుగులు కావాల్సి ఉండగా జాదవ్ అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసి కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు.
1. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులు (18 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసిన తొలి ఆటగాడిగా కోహ్లి.
2. వన్డే క్రికెట్‌లో 100 స్టంపింగ్‌లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని.
3. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ సరసన కోహ్లి (30 సెంచరీలు). సచిన్ (49) అగ్రస్థానంలో ఉన్నాడు.
స్కోరు వివరాలు:-
శ్రీలంక ఇన్నింగ్స్: డిక్‌వెలా (సి అండ్ బి) భువనేశ్వర్ 2; తరంగ (సి) ధోని (బి) బుమ్రా 48; మునవీర (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 4; తిరిమన్నె (బి) భువనేశ్వర్ 67; మాథ్యూస్ (సి) ధోని (బి) కుల్దీప్ 55; సిరివర్దన (సి) శార్దుల్ (బి) భువనేశ్వర్ 18; హసరంగ (రనౌట్) 9; ధనంజయ (స్టంప్డ్) ధోని (బి) చాహల్ 4; పుష్పకుమార (బి) బుమ్రా 8; ఫెర్నాండో నాటౌట్ 7; మలింగ (సి) సబ్– రాహుల్ (బి) భువనేశ్వర్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 238.
వికెట్ల పతనం: 1–14, 2–40, 3–63, 4–185, 5–194, 6–205, 7–212, 8–228, 9–228, 10–238.
బౌలింగ్: భువనేశ్వర్ 9.4–0–42–5; శార్దుల్ 6–0–48–0; బుమ్రా 10–0–45–2; కుల్దీప్ 10–0–40–1; కేదార్ జాదవ్ 4–0–20–0; చాహల్ 10–0–36–1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) పుష్పకుమార (బి) ఫెర్నాండో 16; రహానే (సి) మునవీర (బి) మలింగ 5; కోహ్లి నాటౌట్ 110; పాండే (సి) తరంగ (బి) పుష్పకుమార 36; జాదవ్ (సి) డిక్‌వెలా (బి) హసరంగ 63; ధోని నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (46.3 ఓవర్లలో 4 వికెట్లకు) 239.
వికెట్ల పతనం: 1–17, 2–29, 3–128, 4–237. బౌలింగ్: మలింగ 8–1–35–1; ఫెర్నాండో 7–0–40–1; ధనంజయ 10–0–49–0; మాథ్యూస్ 3–0–14–0; పుష్పకుమార 10–0–40–1; సిరివర్దన 4–0–28–0; హసరంగ 4.3–0–29–1.