‘ఏడు’పు ఆగేదెలా? | Dhoni Unhappy with Team India | Sakshi
Sakshi News home page

‘ఏడు’పు ఆగేదెలా?

Published Wed, Oct 28 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

‘ఏడు’పు ఆగేదెలా?

‘ఏడు’పు ఆగేదెలా?

పరిమిత ఓవర్ల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ‘ఏడు’ అదృష్ట సంఖ్య. జెర్సీ నంబర్ మొదలు బ్యాటింగ్ కిట్‌నుంచి పెర్‌ఫ్యూమ్ బాటిల్స్ వరకు అంతటా ‘7’ కనిపిస్తుంది. అదేంటో గానీ కెప్టెన్‌గా మైదానంలో మాత్రం అతనికి ఇప్పుడు అదే అంకె అచ్చి రావడం లేదనిపిస్తోంది. దానిని అతను పదే పదే గుర్తు చేస్తున్నాడు కూడా. భారత జట్టుకు ఏడో స్థానంలో ఆడగల సమర్థుడైన ‘ఆల్‌రౌండర్’ లేడని... అతను దొరికే వరకు ఫలితాలు ఇలాగే ఉంటాయని కెప్టెన్ చెప్పేశాడు.

మరి రాబోయే రోజుల్లో టీమిండియా ఈ సమస్యకు పరిష్కారం వెతకగలదా... అసలు జట్టు ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి?

 
భారత జట్టుకు ఆల్‌రౌండర్ కొరత  

* వన్డేలు, టి20ల్లో తీరని సమస్య  
* ఏడో స్థానంలో ఆటగాడి కోసం అన్వేషణ
సాక్షి క్రీడా విభాగం: భారత జట్టు ఇటీవల దక్షిణాఫ్రికాతో పరాజయానికి ముందు సొంతగడ్డపై 16 వన్డే సిరీస్‌లు ఆడితే 2 మాత్రమే ఓడింది. అయితే ఆ రెండు సార్లూ వెంటనే కోలుకొని ప్రపంచకప్‌ను, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లో ఓటమి అనంతరం స్వదేశంలో సఫారీల చేతిలోనూ చిత్తయ్యాక మరోసారి టీమిండియా మేనేజ్‌మెంట్ తమను తాము సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.

ఇందులో అన్నింటికంటే ముఖ్యమైంది ‘ఆల్‌రౌండర్’ సమస్యకు పరిష్కారం. సుదీర్ఘ కాలంగా వన్డేలు, టి20ల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను పరిశీలిస్తే ఐదో స్థానం వరకు ఢోకా లేకుండా రెగ్యులర్ బ్యాట్స్‌మన్, ఆ తర్వాత ఆరో స్థానంలో ధోని ఆడటం కనిపిస్తోంది. చివరి నాలుగు స్థానాలు బౌలర్లకు పోగా, మధ్యలో ఏడో స్థానంలో మాత్రం నిఖార్సయిన ఆల్‌రౌండర్ కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అయితే ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా రెండు విభాగాల్లోనూ జట్టుకు ఉపయోగపడగల ‘సవ్యసాచి’ మాత్రం దొరకలేదు.
 
యువీ లేకపోవడంతో...
2012 డిసెంబర్‌లో పాకిస్తాన్‌తో వన్డేలో ధోని ఆఖరిసారిగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. భారత్ స్కోరు 29/5 ఉన్న దశలో అతను అద్భుత సెంచరీ సాధించాడు. అప్పటి బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో యువరాజ్ ఆడాడు. అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్ కావడంతో పాటు బౌలింగ్‌లో కనీసం 7-8 ఓవర్ల వేయగల యువీ ఉన్నంత వరకు జట్టుకు సమస్య ఎదురు కాలేదు. అయితే ప్రస్తుత టీమ్‌లో టాప్-5 రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేలు కలిపి 14 ఓవర్లు మాత్రమే వేసిన రైనానుంచి ఎక్కువగా ఆశించలేం. పైగా ఐసీసీ కొత్త నిబంధనలు వచ్చాక పార్ట్‌టైమర్లను వాడుకోవడం ధోనికి ఇబ్బందిగానే మారింది. గత మూడేళ్లుగా ధోని ఆరో స్థానంలో ఆడుతుండటంతో ఏడో నంబర్ ఆటగాడి పాత్ర కీలకంగా మారింది. అటు బౌలర్‌గా ఉపయోగపడటంతో పాటు ఇన్నింగ్స్ చివరి దశలో భారీ హిట్టింగ్ చేయగల ఆటగాడు అవసరం.

గతంలో యూసుఫ్ పఠాన్ సరిగ్గా ఇలాంటి పాత్ర పోషించాడు. ఫామ్ కోల్పోయి అతను చోటు కోల్పోయాక అలాంటి హిట్టర్ మరొకరు దొరకలేదు. అంతకుముందు ఇర్ఫాన్ పఠాన్ కూడా కొంత వరకు అలాంటి ఆట ప్రదర్శించినా గాయాలతో దూరమయ్యాడు. ఈ సీజన్‌లో అతను ఇంతవరకు దేశవాళీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
 
ఆ ముగ్గురే దిక్కా?
‘చాలా ప్రయోగాలు చేశాం. మీకు నచ్చినా నచ్చకపోయినా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అంటే బిన్నీ, స్పిన్ ఆల్‌రౌండర్ అంటే జడేజా, అక్షర్‌లే’ అని ధోని నేరుగా వ్యాఖ్యానించాడు. ఇందులో ఏ మాత్రం వాస్తవం ఉందనేది ఆసక్తికరం. 14 వన్డేల్లో 230 పరుగులు చేసిన బిన్నీ 20 వికెట్లు పడగొట్టాడు.

ఇందులో బంగ్లా, జింబాబ్వేలపై కలిపి తీసినవి 13 ఉన్నాయి. అయితే జట్టుకు అవసరమైన కీలక దశలో అతను బ్యాటింగ్‌లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాన్పూర్ వన్డే ఓటమిలో అతని పాత్ర కూడా ఉంది!  ఇక ధోని ఆత్మీయుడు రవీంద్ర జడేజా చాంపియన్స్ ట్రోఫీ సహా అనేక మ్యాచ్‌లలో బౌలర్‌గా తన బాధ్యతను బాగా నిర్వహించాడు గానీ బ్యాటింగ్‌లో అతను చేసిందేమీ లేదు.

తన చివరి 16 వన్డేల్లో అతను ఒక్కసారి కూడా కనీసం 40 పరుగులు చేయలేదు. ఓవర్లు అందుబాటులో ఉండి ముందుగా బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఐపీఎల్‌లాంటి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇక బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్ 15 ఇన్నింగ్స్‌లలో కలిపి చేసింది 91 పరుగులే. మరి ఇంతకంటే ఎవరూ లేరనడం భారత క్రికెట్‌కు అవమానకరం.
 
కొత్తగా ప్రయత్నించరా...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు గుర్‌కీరత్ మాన్‌ను ఎంపిక చేసినా ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. దేశవాళీలో గుర్‌కీరత్ రికార్డు చాలా బాగుంది. ఆరో స్థానం, అంతకంటే దిగువన ఆడుతూ 20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 50 సగటు, 80 స్ట్రయిక్ రేట్ ఉన్న అతను...40 వన్డేల్లో 90 స్ట్రయిక్ రేట్, 46 సగటుతో పరుగులు సాధించాడు.

తన ఆఫ్‌స్పిన్‌తో ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఇలాంటి ఆటగాడే ఇప్పుడు భారత్‌కు కావాలి. అక్షర్‌కు బదులు అతనికి అవకాశం ఇచ్చి ఉంటే ఆట గురించి తెలిసేది. ఇక రిషి ధావన్ కూడా నిలకడకు మారుపేరు. దేశవాళీ వన్డేల్లో 90 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేసిన అతను బౌలింగ్‌లో 31 సగటుతో రెగ్యులర్‌గా వికెట్లు తీస్తున్నాడు.

హిమాచల్‌ప్రదేశ్ ఆటగాడిగా రంజీల్లో గ్రూప్ ‘సి’లో ఉండటంతో అతని ప్రతిభకు గుర్తింపు దక్కనట్లు కనిపిస్తోంది. అయితే అదే నిజమైతే ఇటీవల జడేజా 37 వికెట్ల రికార్డుకు కూడా విలువ ఉండదు! గత ఏడాది మీడియం పేసర్‌గా రం జీల్లో 40 వికెట్లు తీసిన అతను, ఈసారి 3 మ్యాచుల్లోనే 16 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవల బంగ్లాదేశ్ ‘ఎ’తో జరిగిన సిరీస్‌లోనూ అతను రాణించాడు. ఇక రెండు వారాల క్రితం రైల్వేస్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన బరోడా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా భారత ‘ఎ’ జట్టు తరఫున ఆకట్టుకున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ల రూపం లో యువ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మాకున్న ముగ్గురు చాలు... అం టూ బిగదీసుకోకుండా ఇలాంటి ఆటగాళ్లను పరీక్షిస్తేనే ఆల్‌రౌండర్లు వెలుగులోకి వస్తారు. జట్టు ‘ఏడు’పు ఆగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement