విజయానికి 7 వికెట్లు | To win 7 wickets | Sakshi
Sakshi News home page

విజయానికి 7 వికెట్లు

Published Tue, Sep 1 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

విజయానికి 7 వికెట్లు

విజయానికి 7 వికెట్లు

శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల టెస్టు సిరీస్ విజయం నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది. దిగ్గజ క్రికెటర్లు తమ కెరీర్‌లో సాధించలేకపోయిన ఘనతకు  యువ భారత్ చేరువయింది. శ్రీలంకతో ఆఖరి టెస్టులో భారత్ జట్టు విజయం దిశగా సాగుతోంది. ఆఖరి రోజు ఏడు వికెట్లు తీస్తే... కోహ్లి ఖాతాలో తొలి టెస్టు సిరీస్ విజయం చేరుతుంది. భారీ వర్షం పడితేనో... అద్భుతమేదైనా జరిగితేనో తప్ప శ్రీలంక ఓటమి నుంచి గట్టెక్కడం కష్టం.
- మూడో టెస్టులో గెలుపు దిశగా భారత్
- శ్రీలంక లక్ష్యం 386... ప్రస్తుతం 67/3  
- సమష్టిగా రాణించిన భారత బ్యాట్స్‌మెన్
కొలంబో:
నాటకీయ మలుపులు తిరుగుతోన్న మూడో టెస్టులో భారత్ జట్టు అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకుంది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌తో పాటు టెయిలెండర్లు సమయోచితంగా రాణించడంతో... భారత జట్టు శ్రీలంకకు 386 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాట్స్‌మెన్ కష్టానికి మరింత వన్నె తెస్తూ ఇషాంత్ శర్మ మరోసారి చెలరేగడంతో శ్రీలంక టాప్ ఆర్డర్ మరోసారి తడబడింది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (ఎస్‌ఎస్‌సీ) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 18.1 ఓవర్లలో మూడు వికెట్లకు 67 పరుగులు చేసింది. సిల్వ (24 బ్యాటింగ్), మ్యాథ్యూస్ (22 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ రెండు వికెట్లు, ఉమేశ్ ఒక్క వికెట్ తీశారు.  
 
అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 76 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటయింది. రోహిత్ (72 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్సర్), స్పిన్నర్ అశ్విన్ (87 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. బిన్నీ (49), నమన్ ఓజా (35), అమిత్ మిశ్రా (39) రాణించారు. లంక బౌలర్లలో ప్రసాద్, ప్రదీప్ నాలుగేసి వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 111 పరుగులు కలుపుకుని భారత్‌కు మొత్తం 385 పరుగుల ఆధిక్యం సమకూరింది. ఆట చివరి రోజు శ్రీలంక గెలవాలంటే మరో 319 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాలి.
 
సమష్టిగా... గౌరవప్రదంగా
ఓవర్‌నైట్ స్కోరు 21/3తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ రోహిత్, కోహ్లి నిలకడగా ఆడటంతో భారీస్కోరు దిశగా సాగింది. కోహ్లి (21) అవుటైనా... రోహిత్, బిన్నీ కలిసి బాగా ఆడారు. ముఖ్యంగా బిన్నీ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. లంచ్ విరామానికి ముందు రోహిత్ అవుటైనా... నమన్ ఓజా, బిన్నీ కలిసి బాగా ఆడారు. లంచ్ తర్వాత ఈ ఇద్దరూ బాగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో బిన్నీ ఒక్క పరుగు తేడాతో అర్ధసెంచరీని కోల్పోగా... ఓజా కూడా భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.

దీంతో భారత్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో లంక శిబిరంలో మ్యాచ్‌పై ఆశలు పెరిగాయి. అయితే అశ్విన్, మిశ్రా అద్భుతంగా ఆడారు. ఈ స్పిన్నర్లిద్దరూ సమయోచితంగా స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు అడపాదడపా బౌండరీలతో ఎనిమిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. మిశ్రా అవుటైన తర్వాత అశ్విన్... ఉమేశ్, ఇషాంత్‌ల సహాయంతో భారత్‌కు మంచి స్కోరు అందించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టెయిలెండర్ల పుణ్యమాని 274 పరుగుల స్కోరుతో మ్యాచ్‌పై పట్టు బిగించింది.
 
ఆరంభంలో వికెట్లు
భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇషాంత్ బౌలింగ్‌లో తరంగ అవుటయ్యాడు. మరో ఎండ్‌లో ఉమేశ్ బౌలింగ్‌లో కరుణరత్నే కూడా పెవిలియన్‌కు చేరడంతో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. చండీమల్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఎదురుదాడి చేసే ప్రయత్నంలో ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ సిల్వ, మ్యా థ్యూస్ జాగ్రత్తగా ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. వెలుతురు సరిగా లేకపోవడంతో మరో 4 ఓవర్లు ఉన్నా ఆట నిలిపివేశారు.
 
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 312; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 201; భారత్ రెండో ఇన్నింగ్స్: పుజారా (బి) ప్రసాద్ 0; రాహుల్ (బి) ప్రదీప్ 2; రహానే ఎల్బీడబ్ల్యు (బి) ప్రదీప్ 4; కోహ్లి (సి) తరంగ (బి) ప్రదీప్ 21; రోహిత్ (సి) ప్రదీప్ (బి) ప్రసాద్ 50; బిన్నీ (సి) తరంగ (బి) ప్రసాద్ 49; నమన్ ఓజా (సి) కరుణరత్నే (బి) హెరాత్ 35; అమిత్ మిశ్రా రనౌట్ 39; అశ్విన్ (సి) పెరీరా (బి) ప్రసాద్ 58; ఉమేశ్ (సి) హెరాత్ (బి) ప్రదీప్ 4; ఇషాంత్ నాటౌట్ 2;
ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (76 ఓవర్లలో ఆలౌట్) 274.
 
వికెట్ల పతనం: 1-0; 2-2; 3-7; 4-64; 5-118; 6-160; 7-179; 8-234; 9-269; 10-274.
 
బౌలింగ్: ప్రసాద్ 19-3-69-4; ప్రదీప్ 17-2-62-4; హెరాత్ 22-0-89-1; మాథ్యూస్ 6-3-11-0; కౌశల్ 12-2-41-0.
 
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: తరంగ (సి) నమన్ (బి) ఇషాంత్ 0; సిల్వ బ్యాటింగ్ 24; కరుణరత్నె (సి) నమన్ (బి) ఉమేశ్ 0; చండీమల్ (సి) కోహ్లి (బి) ఇషాంత్ 18; మ్యాథ్యూస్ బ్యాటింగ్ 22; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 67.
 
వికెట్ల పతనం: 1-1; 2-2; 3-21.
బౌలింగ్: ఇషాంత్ 7-2-14-2; ఉమేశ్ 5-1-32-1; బిన్నీ 4-1-13-0;  మిశ్రా 2-0-2-0; అశ్విన్ 0.1-0-4-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement