
ఐపీఎల్-2025 తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోని అన్ని ఫార్మాట్‌లకు విడ్కోలు పలకనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శనివారం(ఏప్రిల్ 5) చెపాక్ వేదికగా సీఎస్‌కే-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు ధోని తల్లిదండ్రులు స్టేడియంకు వచ్చారు. దీంతో ఢిల్లీ మ్యాచ్ అనంతరం ధోని రిటైర్ కానున్నాడని వార్తలు వినిపించాయి.
కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు చేయకపోయినా సీజన్ అనంతరం మాత్రం ధోని కచ్చితంగా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పునున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై మిస్టర్ కూల్ స్పందించాడు. ఐపీఎల్-2026లో ఆడాలా వద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధోని చెప్పుకొచ్చాడు.
"నేను ఇంకా ఐపీఎల్‌లో ఆడుతున్నా. ప్రతీ ఏడాది సమీక్షించకున్నాకే ఐపీఎల్‌లో పాల్గోంటున్నాను. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఈ జూలై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి నాకు 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ ఎప్పుడు అని నిర్ణయించేది నేను కాదు.. నా శరీరం. నా శరీరం సహకరిస్తోందనపిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఆడుతా" అని రాజ్ షమానీ పాడ్ కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని పేర్కొన్నాడు.
కాగా ఈ ఏడాది సీజన్‌లో ధోనికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికి తన మార్క్‌ను మాత్రం చూపించలేకపోతున్నాడు. 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 76 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా తన జిడ్డు బ్యాటింగ్‌తో అభిమానులకు విసుగు తెప్పిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ధోని రిటైర్ అయ్యి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాలని పలువరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కే జట్టు సైతం తీవ్ర నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట సీఎస్‌కే ఓటమి పాలైంది. చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 8న చంఢీగడ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.