
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శన జోరుగా సాగుతుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత ఇలాకాలో ఓడించిన ఆ జట్టు ఓ అరుదైన ఘనత సాధించింది. ఈ సీజన్‌లో 7 వేర్వేరు వేదికల్లో మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. తొలుత కేకేఆర్‌పై కోల్‌కతాలో, ఆతర్వాత సీఎస్‌కేపై చెన్నైలో, ఎంఐపై ముంబైలో, ఆర్‌ఆర్‌పై జైపూర్‌లో, పంజాబ్‌పై చంఢీఘడ్‌లో, ఆర్‌ఆర్‌పై బెంగళూరులో, తాజాగా డీసీపై ఢిల్లీలో విజయాలు సాధించింది.
ఈ సీజన్‌లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత మైదానంలో (లక్నో) ఓడిస్తే చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఆర్సీబీ లక్నోలో విజయం సాధిస్తే ఈ సీజన్‌లో ఆడిన 7 అవే మ్యాచ్‌ల్లో (ప్రత్యర్థి సొంత మైదానాల్లో జరిగే మ్యాచ్‌లు) విజయాలు సాధించిన జట్టుగా నిలుస్తుంది. తద్వారా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. గతంలో ఏ జట్టు ఓ సీజన్‌లో ఆడిన అన్ని అవే మ్యాచ్‌ల్లో గెలవలేదు.
ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 అవే మ్యాచ్‌లతో పాటు ఓ హోం గ్రౌండ్ (బెంగళూరు) మ్యాచ్‌లో విజయాలు సాధించింది. మే 9న జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఎల్‌ఎస్‌జీని లక్నోను ఢీకొంటుంది. అంతుకుముందు సీఎస్‌కేతో బెంగళూరులో (మే 3) తలపడుతుంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ మ్యాచ్‌ల తర్వాత సన్‌రైజర్స్, కేకేఆర్‌లతో బెంగళూరులోనే తలపడనుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.
కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.
టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది.