చరిత్ర సృష్టించిన కేకేఆర్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే తొలిసారి ఇలా | KKR Scripts History Become 1st Team In IPL No Other Team Has Matched This Record, Check Out Full Story For Details | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన కేకేఆర్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే తొలి జట్టుగా అరుదైన రికార్డు

Published Fri, Apr 4 2025 9:21 AM | Last Updated on Fri, Apr 4 2025 9:52 AM

KKR Scripts History Become 1st Team In IPL No Other Team Has Matched

Photo Courtesy: BCCI/IPL

ఐపీఎల్‌-2025 (IPL 2024)లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) మళ్లీ గెలుపు బాట పట్టింది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిన రహానే సేన.. తాజాగా సొంత మైదానంలో మాత్రం అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH) జట్టుపై 80 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

ఆరంభంలోనే షాక్‌
ఈడెన్‌ గార్డెన్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడిన కేకేఆర్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. అయితే, హైదరాబాద్‌ పేసర్ల దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌ (1), సునిల్‌ నరైన్‌(7)ల వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో కెప్టెన్‌ అజింక్య రహానే (27 బంతుల్లో 38).. అంగ్‌క్రిష్‌ రఘువన్షీతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు.

రఘువన్షీ హాఫ్‌ సెంచరీ
రహానే అవుటైన తర్వాత రఘువన్షీకి జతైన వెంకటేశ్‌ అయ్యర్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. అయితే, రఘువన్షీ మాత్రం చక్కటి షాట్లతో అలరిస్తూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగుల వద్ద ఉన్న వేళ కమిందు మెండిస్‌ బౌలింగ్‌లో అతడు వెనుదిరగడంతో.. రింకూ సింగ్‌ క్రీజులోకి వచ్చాడు.

ఆఖర్లో సీన్‌ రివర్స్‌
ఆ తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. రింకూతో పాటు వెంకటేశ్‌ అయ్యర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటి వరకు నెమ్మదిగా ఆడిన  వెంకటేశ్‌ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించాడు.

మరో ఎండ్‌లో రింకూ సింగ్‌ 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేకేఆర్‌ 200 పరుగులు సాధించింది. రైజర్స్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, ప్యాట్‌ కమిన్స్‌, జీషన్‌ అన్సారీ, హర్షల్‌ పటేల్‌, కమిందు మెండిస్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

పెవిలియన్‌కు వరుస కట్టిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు
ఇక లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ ఆదిలోనే చేతులెత్తేసింది. కేకేఆర్‌ పేసర్ల దెబ్బకు టాపార్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. విధ్వంసకర ఓపెనర్లుగా పేరొందిన ట్రవిస్‌ హెడ్‌ (4), అభిషేక్‌ శర్మ(2) వచ్చీరాగానే అవుట్‌ కాగా.. ఇషాన్‌ కిషన్‌ (2) కూడా మరోసారి విఫలమయ్యాడు.

నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19) సైతం కాసేపే క్రీజులో ఉండగా.. కమిందు మెండిస్‌ (20 బంతుల్లో 27), హెన్రిచ్‌ క్లాసెన్‌ (21 బంతుల్లో 33) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వాళ్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (14) ఒక్కడే డబుల్‌ డిజిట్‌ స్కోరు చేశాడు. ఈ క్రమంలో 16.4 ఓవర్లలో 120 పరుగులకే సన్‌రైజర్స్‌ ఆలౌట్‌ అయింది.

కేకేఆర్‌ బౌలర్లలో పేసర్‌ వైభవ్‌ అరోరా ట్రవిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, క్లాసెన్‌ రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చి రైజర్స్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించాడు. మిగతా వాళ్లలో వరుణ్‌ చక్రవర్తి మూడు, ఆండ్రీ రసెల్‌ రెండు, సునిల్‌ నరైన్‌, హర్షిత్‌ రాణా ఒక్కో వికెట్‌ సాధించారు.

చరిత్ర సృష్టించిన కేకేఆర్‌.. ఐపీఎల్‌ హిస్టరీలోనే తొలిసారి ఇలా
ఇక ఈ విజయం ద్వారా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై కేకేఆర్‌ మరోసారి తమ ఆధిప​త్యాన్ని చాటుకుంది. రైజర్స్‌పై కోల్‌కతాకు ఇది ఏకంగా 20వ గెలుపు కావడం విశేషం. ఇదిలా ఉంటే.. ఆర్సీబీపై కూడా ఇప్పటి వరకు 20 విజయాలు సాధించిన కేకేఆర్‌.. పంజాబ్‌ కింగ్స్‌పై అత్యధికంగా 21 సార్లు గెలుపొందింది.

ఈ క్రమంలో కోల్‌కతా సరికొత్త రికార్డు సృష్టించింది. ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేర్వేరు జట్లపై 20కి పైగా విజయాలు సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఐపీఎల్‌-2024 ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలవడం కేకేఆర్‌కు ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. ఈ గెలుపు ద్వారా కేకేఆర్‌ ఖాతాలో మూడో టైటిల్‌ చేరింది.

ఐపీఎల్‌ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్లు
👉ముంబై ఇండియన్స్‌- కేకేఆర్‌పై 24 విజయాలు
👉చెన్నై సూపర్‌ కింగ్స్‌- ఆర్సీబీపై 21 విజయాలు
👉కేకేఆర్‌- పంజాబ్‌ కింగ్స్‌పై 21 విజయాలు
👉ముంబై ఇండియన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌పై 20 విజయాలు
👉కేకేఆర్‌- ఆర్సీబీపై 20 విజయాలు
👉కేకేఆర్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై 20 విజయాలు.

 

 చదవండి: Kamindu Mendis: కుడి ఎడమైతే పొరపాటు లేదోయి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement