
Photo Courtesy: BCCI
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కు కోపమొచ్చింది. విమర్శలు చేసే వాళ్లు.. ముందుగా తమ పరిస్థితి ఏమిటో గమనించుకోవాలని.. ఆ తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలంటూ మండిపడ్డాడు. స్టూడియోలో కూర్చుని మైదానంలోని పరిస్థితులను ఎవరూ అర్థం చేసుకోలేరని.. కామెంట్రీ పేరుతో శ్రుతిమించిన విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు
ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అమ్ముడుపోకుండా మిగిలిపోయిన విషయం తెలిసిందే. ముంబై తరఫున దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటినా ఫ్రాంఛైజీలు ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను పట్టించుకోలేదు. అయితే, లక్నో యువ పేసర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) గాయం కారణంగా.. శార్దూల్‌కు ఊహించని విధంగా అదృష్టం కలిసి వచ్చింది.
జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడు
సీజన్ మొత్తానికి దూరమైన మొహ్సిన్ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది. అంతేకాదు తుదిజట్టులోనూ చోటిచ్చింది. అయితే, శార్దూల్ కూడా యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో కలిపి 11 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
200 స్కోరు అనేది కామన్
ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌పై శనివారం నాటి మ్యాచ్‌లో లక్నో విజయానంతరం శార్దూల్ ఠాకూర్ విమర్శకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ‘‘ఈ సీజన్ ఆరంభం నుంచి మేము బాగానే బౌలింగ్ చేస్తున్నాం. అయితే, చాలాసార్లు కామెంట్రీలో మా గురించి విమర్శుల చేస్తూనే ఉన్నారు.
బౌలర్ల పట్ల కఠినంగా మాట్లాడుతున్నారు. ఈరోజుల్లో 200 స్కోరు అనేది కామన్ అయిపోయిన విషయాన్ని గుర్తించాలి. క్రికెట్ ఆడే తీరు రోజురోజుకూ మారిపోతోంది. స్టూడియోలో కూర్చుని ఒకరి బౌలింగ్ గురించి వ్యాఖ్యానాలు చేయడం సులువే.
అక్కడ కూర్చుని మాట్లాడటం తేలికే.. ఇక్కడికి వస్తే తెలుస్తుంది
కానీ మైదానంలో ఉన్న వాళ్లకే వాస్తవ పరిస్థితుల గురించి తెలుస్తుంది. వేరే వాళ్లను విమర్శించే వాళ్లు.. వారి గణాంకాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి సమీక్షించుకోవాలి’’ అని శార్దూల్ ఠాకూర్ కామెంటేటర్లకు చురకలు అంటించాడు.
కాగా ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో ఓటమి పాలైన లక్నో త్వరగానే కోలుకుంది. ఇప్పటికి ఆరు మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఘన విజయం
బాధ్యతాయుతమైన బౌలింగ్‌కు తోడు.. దూకుడైన బ్యాటింగ్‌తో సొంత మైదానంలో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయంతో మెరిసి సత్తా చాటింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పంత్ సేన.. గుజరాత్‌ను 180 పరుగులకు కట్టడి చేసింది. లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి రెండేసి వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (31 బంతుల్లో 58) మరోసారి విజృంభించగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ (18 బంతుల్లో 21) మరోసారి విఫలమయ్యాడు. అయితే, నికోలస్ పూరన్ (34 బంతుల్లో 61) ధనాధన్ దంచికొట్టగా.. ఆయుశ్ బదోని (20 బంతుల్లో 28 నాటౌట్) అతడికి సహకరించాడు. ఫలితంగా 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి లక్నో లక్ష్యాన్ని ఛేదించింది.
చదవండి: నేను కెప్టెన్‌ని!.. ముందు నన్ను అడగాలి కదా: మండిపడ్డ శ్రేయస్ అయ్యర్