
విద్యుత్ ఫీడర్ల ఎనర్జీని ఆడిట్ చేయాలి
నెల్లూరు (వీఆర్సీసెంటర్): జిల్లాలోని ప్రతి ఒక్క విద్యుత్ ఫీడర్ ఎనర్జీని ఖచ్చితంగా ఆడిట్ చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య అధికారులను ఆదేశించారు. నెల్లూరు వచ్చిన ఆయన విద్యుత్ భవన్‌లో జిల్లా అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ లైన్‌లాస్ ఎక్కువ ఉందని వెంటనే తగ్గించాలని, ఎనర్జీ ఆడిట్‌పై అధికారులు సమీక్ష చేయకపోతే విద్యుత్ సంస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. జిల్లాలోని 8వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మే నెల 31 లోపు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక విద్యుత్ ఫీడర్ ద్వారా ఎంత విద్యుత్ పంపిణీ అవుతోంది, ఆ మేరకు రెవెన్యూ వస్తుందా లేదా అనేది ఎనర్జీ ఆడిట్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చని అన్నారు. సమావేశంలో జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్, జిల్లా సూర్యఘర్ నోడల్ అధికారి శేషాద్రి బాలచంద్ర, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్సీ కేంద్రాలకు
పాఠ్యపుస్తకాలు
నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి గోదాముల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా జిల్లాలోని ఎమ్మార్సీ కేంద్రాలకు పాఠ్యపుస్తకాలను తరలిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు తెలిపారు. శనివారం పాఠ్యపుస్తకాలతో వెళుతున్న బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సెమిస్టర్–1కు సంబంధించి 10,23,718 పాఠ్యపుస్తకాలు వచ్చినట్లు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం రోజున వాటిని అందజేస్తామన్నారు.