
భువనేశ్వర్–యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా భువనేశ్వర్–యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 24 నుంచి జాన్ 28 వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ (02811) జంక్షన్ నుంచి యశ్వంత్‌పూర్‌కు రైలు బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా మే 26 నుంచి జూన్ 30 తేదీ వరకు ప్రతి సోమవారం యశ్వంత్‌పూర్ జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నరసరావుపేట, మార్కాపురం రోడ్డు, గిద్దలూరు, నంద్యాల, డోన్, ధర్మవరం జంక్షన్, ఎస్‌ఎస్‌ఎస్‌పీ నిలయం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
3 రోజుల సంతాప దినాలు
ప్రశాంతి నిలయం: పోప్ ఫ్రాన్సిస్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిందని కలెక్టర్ చేతన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంతాప దినాల సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా జాతీయ జెండా సగం వరకు ఎగురవేయనున్నట్లు పేర్కొన్నారు.
సివిల్స్‌లో కదిరి వాసికి 918వ ర్యాంకు
కదిరి అర్బన్: యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో కదిరి పట్టణానికి చెందిన జి.సాయి షణ్ముఖకు 918వ ర్యాంకు వచ్చింది. అడపాలవీధిలో నివాసం ఉంటున్న రిటైర్డు ఏఎస్‌ఐ నరసింహులు, విజయభారతి దంపతుల కుమారుడు సాయి షణ్ముఖ సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీలో ఆరేళ్లుగా ప్రిపేరవుతున్నాడు. ఐదవ ప్రయత్నంలో విజయం సాధించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తానీ స్థాయికి చేరుకున్నానని సాయి షణ్ముఖ తెలిపాడు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థుల సత్తా
ధర్మవరం అర్బన్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ధర్మవరం విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ధర్మవరం పట్టణంలోని దుర్గానగర్‌లో నివసిస్తున్న హోంగార్డు కేఎస్ మహేష్, శ్యామల దంపతుల కూతురు హేమనందిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతోంది. ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 1000 మార్కులకు 990 మార్కులు సాధించింది. ధర్మవరం పేరు నిలబెట్టింది.
స్టేట్ సెకండ్ ర్యాంకు..
ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో ధర్మవరం పట్టణంలోని కేశవనగర్‌కు చెందిన అచ్యుత శ్రీనివాసులు, ఉమామహేశ్వరి దంపతుల రెండో కుమారుడు అచ్యుత భానుప్రకాష్ ఎంఈసీలో 500 మార్కులకు 495 మార్కులతో తెలంగాణ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచాడు. కాగా హేమనందిని, భానుప్రకాష్ ధర్మవరంలోని పీసీఎంఆర్ పాఠశాలలో పదో తరగతి చదివారు.

భువనేశ్వర్–యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు