
ఒకే ఈతలో నాలుగు మేక పిల్లలు!
గుమ్మఘట్ట: మండలంలోని రంగచేడు గ్రామానికి చెందిన సిద్దయ్యగారి మల్లికార్జున పెంచుతున్న మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అంతకు ముందుకు కూడా ఇదే మేక మూడు పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పుట్టిన నాలుగు పిల్లలు క్షేమంగా ఉండడంతో గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. అధిక హార్మన్ల ప్రభావంతో అండాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని పశు వైద్యాధికారి నవీన్‌కుమార్ పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి పక్కన ఉన్న అన్న క్యాంటీన్ ఎదుట గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవచ్చునని అంచనా వేశారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. వ్యక్తి మిస్సింగ్ కేసుల్లో సంబంధీకులు ఎవరైనా ఉంటే ధర్మవరం వన్ టౌన్ సీఐ (94407 96831), ఎస్‌ఐ (94948 16259), హెడ్ కానిస్టేబుల్ (98496 48216)ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
వ్యక్తి దుర్మరణం
కదిరి టౌన్: ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లిలో నివాసముంటున్న డేరంగుల లక్ష్మీనారాయణ (40)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. గురువారం రాత్రి పనిముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన లక్ష్మీనారాయణ... మున్సిపల్ పరిధిలోని టిడ్కో ఇళ్ల వద్దకు చేరుకోగానే వేగాన్ని నియంత్రించుకోలేక గోరంట్ల వైపుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఒకే ఈతలో నాలుగు మేక పిల్లలు!