
రూ.కోటికి కుదిరిన డీల్..?
చిలమత్తూరు: చిత్రావతి నదిపై ఏకంగా బ్రిడ్జి నిర్మించి నదీజలాలు సొంతానికి మళ్లించుకుని, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని, సమీపంలోని పొలాలకు రైతులు వెళ్లకుండా ఇబ్బందులు పెడుతున్న రియల్టర్ రెడ్డెప్పశెట్టికి ‘రెవెన్యూ’ అండగా నిలుస్తోంది. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వశాఖలోని కొందరు అధికారులు అమ్యామ్యాలకు ఆశపడి రియల్టర్‌కు సహకారం అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కోర్టును ఆశ్రయించేందుకు సహకారం
రియల్టర్ రెడ్డెప్పశెట్టి భూ ఆక్రమణలు, రైతులకు పెడుతున్న ఇబ్బందులు, విద్యుత్ చోరీ, నదీ జలాల అక్రమ వినియోగం తదితర వాటిపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కాగా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు హడావుడి చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఇక చర్యలే తరువాయి అన్న తరుణంలో రైతులు, మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అయితే రెవెన్యూ శాఖలోని ఓ డివిజనల్ స్థాయి అధికారి క్షేత్రస్థాయి నివేదికలను పక్కన పెట్టి సదరు రియల్టర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి రావడంతో రియల్టర్ మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. తప్పుడు సమాచారంతో తన అక్రమాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఎవిక్షన్ నోటీసు ఇచ్చినా...
రెడ్డెప్పశెట్టి అక్రమాలు గుర్తించిన అధికారులు నోటీసులు ఇవ్వడం, కేసు నమోదు చేయించడం తదితర చర్యలన్నీ చకచకా జరిగిపోయాయి. నివేదికలను కూడా ఉన్నతాధికారులకు పంపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు రియల్టర్‌కు ఎవిక్షన్ నోటీసు కూడా ఇచ్చారు. నెల గడిచినా చర్యలు తీసుకోలేదు. ఉన్న ఫలంగా రెవెన్యూ డివిజనల్ స్థాయి అధికారి రహస్యంగా రెడ్డెప్పశెట్టి ఎస్టేట్‌కు రావడం, వెళ్లడం జరిగిపోగా... ఆ తర్వాత అన్నీ నెమ్మదించాయి. ఫిబ్రవరి 28వ తేదీలోపే బ్రిడ్జిని తొలగిస్తామని చెప్పిన ఇరిగేషన్ అధికారులు... రియల్టర్ కోర్టుకు వెళ్లేందుకు సమయాన్ని ఇచ్చి అతను తప్పించుకునేందుకు అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, ఈడీ అటాచ్‌మెంట్ భూములు, నది ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చి మిన్నకుండి పోయారు. మండలస్థాయి రెవెన్యూ అధికారి హిందూపురానికి పరిమితం కావడం, డివిజనల్ స్థాయి అధికారి ఆదేశాలతో రెడ్డెప్పశెట్టితో లోగుట్టు ఒప్పందాలు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
బెంగళూరు కేంద్రంగా డీల్..?
రియల్టర్ అక్రమాలు, ఆక్రమణలపై నోరు మెదపకుండా ఉండేందుకు బెంగళూరు కేంద్రంగా డివిజనల్ స్థాయి అధికారితో రూ. కోటికి ఒప్పందం చేసుకున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రెడ్డెప్పశెట్టి ఆక్రమణలో ఉన్న భూములను సైతం అధికారికంగా కట్టబెట్టే విధంగా డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఇప్పటికే ఇద్దరు వీఆర్‌ఓలకు కేటాయించినట్లు తెలుస్తోంది. రియల్టర్ ఆక్రమణలోని భూములు ప్రస్తుతం రూ. కోట్ల విలువ చేస్తుండగా... అధికార యంత్రాంగం ఆయనకు ధారాదత్తం చేసేందుకు సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రియల్టర్ రెడ్డెప్పశెట్టికి రెవెన్యూ అండ
బెంగళూరు కేంద్రంగా సెటిల్‌మెంట్!
డివిజనల్ స్థాయి అధికారి
పూర్తి సహకారం