
ఇంటింటా సౌర వెలుగులు విరజిమ్మాలి
ప్రశాంతి నిలయం: జిల్లా అంతటా సౌరవెలుగులు విరజిమ్మేలా ‘పీఎం సూర్యఘర్’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో 10 వేల పీఎం సూర్యఘర్ రూఫ్‌టాప్ యూనిట్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో నియోజకవర్గాల అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ‘పీఎం సూర్యఘర్’పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.55 వేలు సబ్సిడీగా అందించి యూనిట్‌ను పూర్తి ఉచితంగా అందిస్తుందన్నారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను లబ్ధిదారు అవసరాలకు వాడుకుని మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తే యూనిట్‌కు రూ.2.90 వంతున చెల్లిస్తారన్నారు. బీసీలకు 2 కిలోవాట్‌కు కేంద్రం రూ.60 వేలు, రాష్ట్ర ప్రభుత్వం 10 వేల చొప్పున రాయితీ ఇస్తుందని, మరో రూ.35 వేలు లబ్ధిదారుడు బ్యాంక్ ద్వారా రుణం పొంది ఐదేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, బ్యాంకర్లు, విద్యుత్ అధికారులు సమన్వయం చేసుకొని లక్ష్యాలను చేరుకునేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇక అన్ని నియోజకవర్గాల విజన్ ప్రణాళికలు రూపొందించాలని, భూగర్భ జలాలు, వ్యవసాయం, ఉద్యాన శాఖలు పూర్తి వివరాలతో జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్‌కు సంబంధించి పోస్టర్లు, ఫ్లెక్సీలు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి కాలుష్యం జరగకుండా అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్‌కుమార్, మహేష్, డీపీఓ సమత, డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, సీపీఓ విజయ్ కుమార్, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం