
‘ప్రారంభించిన లక్ష్యాన్ని అందుకునే అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా ముగించిన అరుదైన నాయకుడు. కేంద్ర మంత్రిగా ఏ శాఖ కేటాయించాలని అడిగినప్పుడు ‘‘నా లక్ష్యం మీకు తెలుసు. నాకు తెలంగాణ రాష్ట్రం కావాలి. ఏ శాఖ ఇచ్చినా నాకు అంగీకారమే’అంటూ వ్యక్తిగత అవకాశాల కంటే తెలంగాణ సాధనకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు’అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ ‘ది కొయలేషన్ ఇయర్స్ 1996–2012’లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్‌ఎస్) వ్యవస్థాపకుడు కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పదవీ త్యాగాల పునాదుల మీద పార్టీని ప్రారంభించిన ఉద్యమ నాయకుడు. ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎత్తిన జెండా దించకుండా ముందుకు సాగిన నాయకుడు. బీఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఉద్యమ నేతగా, ప్రభుత్వ సారథిగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ స్ఫూర్తిమంత ప్రయాణం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గమ్యాన్ని ముద్దాడారు. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ఎజెండాగా ఆయన ఎక్కని కొండ లేదు.. మొక్కని బండలేదు.
పక్కా రోడ్ మ్యాప్‌తో ఉద్యమంలోకి..
కేసీఆర్ పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించుకున్న తర్వాతే తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు మునుపు ఆయన లోతుగా విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కసరత్తు చేశారు. 1969 ఉద్యమం నేరి్పన పాఠాల నుంచి ‘శాంతియుత మార్గంలోనే తెలంగాణ’అనే నిర్ణయం తీసుకున్నారు. రక్తం చుక్క చిందించకుండా తెలంగాణ సాధిస్తానని, ఉద్యమం వీడితే రాళ్లతో కొట్టండి అని పిలుపునివ్వడం ద్వారా తన నిబద్ధతను చాటే ప్రయత్నం చేశారు.
ఉప ఎన్నికలు.. రాజీనామా అ్రస్తాలు
లక్ష్య సాధనకు పదవులకు రాజీనామా, ఉప ఎన్నికలను అస్త్రంగా వాడిన నేత దేశ చరిత్రలో బహుశా కేసీఆర్ ఒక్కరేనేమో. భావజాల వ్యాప్తి, లక్ష్య సాధనకు ఉప ఎన్నికలతో ప్రయోగాలు చేశారు. ఉప ఎన్నికల అస్త్రం 2008లో విఫలమైనా, 2010లో ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాలపై కేసీఆర్ పట్టును పెంచాయి. 2012లో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా జరిగిన ఉప ఎన్నికలు కేంద్రంపై తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యతను సృష్టించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లను కోల్పోగా కాంగ్రెస్ కూడా నాలుగు చోట్ల డిపాజిట్ గల్లంతు అయ్యింది.
అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే..
టీఆర్‌ఎస్ ఏర్పాటు ద్వారా అనునిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కేసీఆర్ కార్యాచరణ కొనసాగింది. తెలంగాణ భావజాల వ్యాప్తికి వరుస బహిరంగ సభలు, నాగార్జునసాగర్ నీళ్లు, చేనేత కార్మికుల కోసం బిక్షాటన, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సభ, పాలమూరు వలస కూలీల సమస్యపై పాదయాత్ర, జల సాధన సభ, సిద్దిపేట నుంచి సైకిల్ ర్యాలీ, ఫ్లోరైడ్ సమస్యపై పాదయాత్ర వంటి కార్యక్రమాలతో తొలి రెండేళ్లు కేసీఆర్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా చూసుకున్నారు. ఉద్యమానికి కీలక మలుపు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించడం కేసీఆర్ శైలిగా మారిపోయింది.
ఉద్యమ సమయంలోనే ‘దళితాభివృద్ది’
తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను 2003లోనే సిద్ధం చేశారు. 2003 అక్టోబర్ 17న హైదరాబాద్ గ్రీన్ పార్కు హోటల్‌లో దళిత స్వయం సమృద్ధి సమావేశం నిర్వహించారు. అదే ఏడాది అక్టోబర్ 18, 19 తేదీల్లో టీఆర్‌ఎస్ ఎస్టీ, ఎస్సీ, బీసీ పాలసీలను విడుదల చేశారు. ఈ పాలసీలను ప్రజలకు వివరించేందుకు అక్టోబర్ 22న మేడారంలో పల్లెబాటను కేసీఆర్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాల్లో ఈ పాలసీలు మూలాధారంగా నిలిచాయి.
నేషనల్ ఫ్రంట్ కన్వినర్‌గా కేసీఆర్
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తన ఆలోచన, మక్కువను ఉద్యమ సమయం నుంచే వివిధ రూపాల్లో బయటపెడుతూ వచ్చారు. ఓ వైపు క్షేత్ర స్థాయిలో తన కొత్త పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న నాయకులు, పార్టీలకు ఒకే తాటి మీదకు తెచ్చి 2003 సెపె్టంబర్ 9న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రాల నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ కన్వీనర్‌గా కొనసాగారు.
2008 ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురైనా అధిగమిస్తూ ఢిల్లీలో ‘థర్డ్ ఫ్రంట్’ఏర్పాటు దిశగా చర్చలు జరిపారు. 2008 జూలై 18 నుంచి 23 వరకు అజిత్ సింగ్, మాయావతి, దేవెగౌడ్ తదితరులతో చర్చలు జరిపారు. 2022లో బీఆర్‌ఎస్ స్థాపనకు ముందూ కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇవే తరహా ప్రయత్నాలు చేయడం గమనార్హం.
ఎన్నికల పొత్తులు.. ఎత్తులు
టీఆర్‌ఎస్ ఆవిర్భంచిన కొద్ది నెలల్లోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి 25 శాతం ఓటు బ్యాంకు సాధించిన కేసీఆర్.. 2004 సాధారణ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యతను కాంగ్రెస్‌కు సృష్టించారు. 2009 సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ ఏర్పాటు పట్ల విముఖంగా ఉన్న టీడీపీ, సీపీఐ, సీపీఎంతో కూడిన ‘మహా కూటమి’తోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా> ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నారు. 2004లో కాంగ్రెస్ టీఆర్‌ఎస్‌కు లాభం చేకూర్చగా, 2009 ఎన్నికల్లో టీడీపీ కలిసి పోటీ చేయడం కలిసి రాలేదు. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరిగా బరిలోకి దిగారు.
ఉద్యమ కాలం నుంచే రాజకీయ పునరేకీకరణ..: పార్టీని బలోపేతం చేయడం, ఎదుటి పార్టీలను బలహీన పరచడం లక్ష్యంగా కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే రాజకీయ పునరేకీరణ వ్యూహానికి పదును పెడుతూ వచ్చారు. పార్టీ ఆవిర్భావ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న రేగులపాటి పాపారావు (టీడీపీ), రావుల రవీంద్రనాథ్‌రెడ్డి (బీజేపీ), ఆలె నరేంద్ర (ఎంపీ బీజేపీ) కేసీఆర్‌తో కలిసి నడిచారు.
2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష ఘట్టం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, టీడీపీ నుంచి జోగు రామన్న, గంప గోవర్దన్ టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంపీలు డాక్టర్ వివేక్, మందా జగన్నాథం, పలువురు మాజీ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే కోవలో 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు 2014–23 మధ్యకాలంలో టీడీపీ, కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ పునరేకీకరణ కొనసాగించారు.
ఉద్యమ రూపాలుగా కళలు.. పండుగలు..: రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక కోణాన్ని కూడా ఆవిష్కరించి ఉద్యమ రూపం ఇచ్చిన నేత కేసీఆర్. జానపద పాటలు, నృత్యాలు, ఒగ్గు కథలు, గొల్ల సుద్దులు, బుర్ర కథలు, యక్షగానాలు, బతుకమ్మలు, బోనాలు తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా నిలిచాయి. ధూంధాం, వంటావార్పు, సడక్ బంధ్, రైలు రోకో, సాగర హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, తదితరాలు కొత్త ఉద్యమ రూపాలను ఆవిష్కరించాయి.
స్వరాష్ట్ర ఆకాంక్ష ప్రతీక ‘తెలంగాణ తల్లి’..: తెలుగుతల్లి అస్థిత్వాన్ని ‘ఎవరి తల్లి.. ఎక్కడి తల్లి’అని ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ‘తెలంగాణ తల్లి’అనే భావనకు కేసీఆర్ పురుడు పోశారు.
జేఏసీ.. వినూత్న ఆలోచన..: ఎన్నికల్లో పొత్తులతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలను తెలంగాణవాదంతో కట్టిపడేసిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఈ వ్యూహాన్ని మరింత విస్తృతం చేశారు. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో అన్ని పార్టీలు, శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘జాయింట్ యాక్షన్ కమిటీ’అనే ఎత్తుగడను తెరమీదకు తెచ్చారు.
2009 డిసెంబర్ 23న నాటి కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డి నివాసంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ‘జేఏసీ’ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్‌గా కళింగ ఫంక్షన్ హాల్‌లో తొలి భేటీ నిర్వహించారు. తర్వాతి కాలంలో ఈ జేఏసీ నుంచి కాంగ్రెస్, టీడీపీ వైదొలిగినా బీజేపీ, ఇతర పక్షాలు చివరి వరకూ కొనసాగాయి. విభిన్న భావజాలాలు కలిగిన పార్టీలు, సంస్థలు, ఉద్యోగసంఘాలు జేఏసీ వేదికగా పనిచేశాయి.
కలానికి పదును పెట్టిన కేసీఆర్..: రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ కళలు, సాహిత్యాన్ని ఆయుధంగా మార్చిన వైనం కూడా కేసీఆర్‌లో చూడొచ్చు. అవసరమైన సందర్భంలో తాను కలం చేతబట్టి పాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని.. అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది’అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ‘గారడీ చేస్తుండ్రు.. గజిబిజి చేస్తుండ్రు’అంటూ తెలంగాణ వ్యతిరేకుల తీరును ఎండగట్టారు.
చెప్పినదీ.. చెప్పనిదీ చేయడమే..!..: ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వాధినేతగా తాను చెప్పినదీ చెప్పనిదీ కూడా చేసి చూపడం ద్వారా కేసీఆర్ తన వినూత్న శైలిని చాటుకుంటూ వస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి 2018 సెప్టెంబర్ 6 వరకు 51 నెలల పాటు సాగిన పాలనలో వినూత్న నిర్ణయాలతో విమర్శలు, ప్రశంసలు పొందిన సందర్భాలు అనేకం. బీపీఎల్ ఆదాయ పరిమితి, ఆసరా పెన్షన్ల పెంపు, బీడీ కార్మికులకు భృతి వంటి సంక్షేమ పథకాలతో పాటు ‘కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్’వంటి వినూత్న పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు.
2014–18 వరకు ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ల ప్రస్థానంలో సుమారు 500 సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ఆచరణలో చూపిన నేత కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో లేని దళితబంధు, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలు లెక్కకు మిక్కిలి. తెలంగాణ అత్మను అర్థం చేసుకున్న నేతగా పేరొందిన కేసీఆర్ వ్యవసాయం, నీటిపారుదల, ఐటీ, పరిశ్రమలు, విద్య ఇలా ప్రతీ రంగంపైనా తనదైన ముద్ర వేశారు.
ప్రతిపక్ష నేతగా మరో ప్రస్థానం..: నాలుగు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ ఉద్యమ నేతగా, ప్రభుత్వాధిపతిగా పనిచేసిన కేసీఆర్ 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష నాయకుడి పాత్రలోకి మారిపోయారు. ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగాన్ని నడుపడంలోనూ విలక్షణ శైలిని చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.