తగినంత గ్యారంటీ | 90 thousand crores in budget for welfare in the Telangana budget | Sakshi
Sakshi News home page

తగినంత గ్యారంటీ

Published Thu, Mar 20 2025 4:19 AM | Last Updated on Thu, Mar 20 2025 5:54 AM

90 thousand crores in budget for welfare in the Telangana budget

సంక్షేమానికి బడ్జెట్‌లో రూ.90 వేల కోట్లు కేటాయించామంటున్న ప్రభుత్వ వర్గాలు

ఆరు గ్యారంటీలకు రూ. 56,000 కోట్లు.. 

ఇతర సంక్షేమ పథకాలకు  రూ. 35,000 కోట్లు.. 

రేషన్‌ షాపుల్లో సన్న బియ్యం, రాజీవ్‌ యువ వికాసం లాంటి కొత్త పథకాలకు నిధులు

రైతు బీమా, వడ్డీలేని రుణాలు, కల్యాణలక్ష్మి కొనసాగింపు

సొంత పన్నుల ఆదాయం, అప్పులపైనే ఆశలు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలతో పాటు మహిళలు, రైతులు, విద్యార్థులకు వర్తించే ఇతర సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ 2025–26 సంవత్సరానికి బడ్జెట్‌ కేటాయింపులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం తదితర రంగాలకు చూపెట్టిన గణాంకాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నాయి. 

ఆరు గ్యారెంటీలతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు కలిపి ఈసారి బడ్జెట్‌లో రూ.90,500 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించాయి. ఆరు గ్యారంటీల కింద రూ.56,084 కోట్లు, స్కాలర్‌ షిప్‌లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రాజీవ్‌ యువ వికాసం (కొత్త పథకం), డైట్‌ చార్జీలు, రైతు బీమా, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, విద్యుత్‌ సబ్సిడీలు, రేషన్‌ బియ్యానికి మరో రూ. 34,416 కోట్లు ప్రతిపాదించినట్లు చెబుతున్నాయి. 

ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి, గృహజ్యోతి, సన్న ధాన్యానికి బోనస్, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు నిధులు కేటాయించినట్లు ఆ వర్గాలు వివరిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్‌

అప్పుల విషయానికి వస్తే 2024–25లో ప్రతిపాదించిన మొత్తానికి రూ.7,500 కోట్లు అదనంగా రూ.69 వేల కోట్లకు పైగా సమీకరించాలని ఈ బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో బహిరంగ మార్కెట్‌ రుణాలు రూ.64,539 కోట్లు కాగా, కేంద్రం నుంచి, ఇతర రుణాలు కలిపి మొత్తం రూ.69 వేల కోట్లు చూపెట్టారు. 

ఇది మొత్తం బడ్జెట్‌లో 21 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. అప్పులు తీసుకోవడంతో పాటు అప్పులు చెల్లించే పద్దును కూడా ఈసారి పెంచారు. గతంలో చేసిన అప్పులకు వడ్డీ, అసలు చెల్లింపు కింద రూ. 35,217 కోట్లు చూపెట్టారు. ఇది మొత్తం బడ్జెట్‌లో దాదాపు 11.5 శాతం. 

పెరిగిన పన్ను ఆదాయం అంచనాలు
బడ్జెట్‌లో పేర్కొన్న రెవెన్యూ రాబడుల గణాంకాలను పరిశీలిస్తే..ఈసారి రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పద్దు భారీగా కనిపిస్తోంది. గత బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.7 వేల కోట్లు అదనంగా పన్ను రాబడుల కింద చూపెట్టారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.38 లక్షల కోట్ల పన్ను ఆదాయ ప్రతిపాదనలు చేయగా, రూ.1.29 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఈసారి రూ.1.45 లక్షల కోట్లను రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కింద చూపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర పన్నుల్లో వాటాను కలుపుకొంటే ఈ ఆదాయ గణాంకాలు రూ.1.75 లక్షల కోట్లకు చేరాయి. వీటికి తోడు పన్నేతర ఆదాయం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లను కలిపి మొత్తం రూ.2.29 లక్షల కోట్ల రెవెన్యూ రాబడులను ప్రతిపాదించారు. 

గత ప్రతిపాదనల కంటే ఇది రూ.8 వేల కోట్లు ఎక్కువ. గత బడ్జెట్‌లో రూ.2.21 లక్షల కోట్లు రెవెన్యూ రాబడుల కింద చూపెట్టగా, సవరించిన అంచనాల ప్రకారం ఇది రూ.2.02 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రెవెన్యూ రాబడులు అంచనాల కంటే రూ.20 వేల కోట్లు తగ్గాయి. అయినా, ఈసారి రెవెన్యూ రాబడులను రూ.2.29 లక్షల కోట్లుగా ప్రతిపాదించారు. 

విద్య, వైద్యానికి కాస్త ఎక్కువగా..
ప్రధాన శాఖల వారీగా పరిశీలిస్తే విద్యా శాఖకు గత ఏడాది కంటే రూ.2 వేల కోట్లు అధికంగా రూ.23 వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. వైద్యరంగానికి గత ఏడాది కంటే రూ.800 కోట్లు అధికంగా రూ.12,393 కోట్లు ప్రతిపాదించారు. రైతు రుణమాఫీ చేసిన నేపథ్యంలో వ్యవసాయ రంగానికి గత ఏడాది కంటే కొంచెం తక్కువ నిధులను కేటాయించారు. గత ఏడాది వ్యవసాయ శాఖకు రూ.26,500 కోట్లు ప్రతిపాదించగా, ఈసారి రూ.24,500 కోట్లు చూపెట్టారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి ఈసారి రూ.34,070 కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 31,605 కోట్లను ప్రతిపాదించారు. ఈసారి కల్యాణలక్ష్మి పథకానికి ప్రత్యేకంగా రూ.3,683 కోట్లు, విద్యార్థుల స్కాలర్‌­షిప్‌లు, డైట్‌ చార్జీల కింద రూ.7 వేల కోట్లకు పైగా నిధులు చూపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12 వేల కోట్లు, ఆర్టీసీకి రూ.4,305 కోట్లు కేటాయించారు. 

సవరణల బడ్జెట్‌లో భారీ వ్యత్యాసం
2024–25 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలను పరిశీలిస్తే ప్రతిపాదనలకు, సవరణల బడ్జెట్‌కు మధ్య భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. 2024–25 వార్షిక బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ.2,91,059 కోట్లుగా ప్రతిపాదించగా, సవరించిన అంచనాల మేరకు అది రూ.2,66,034.51 కోట్లకు తగ్గింది. ఈ సవరించిన అంచనాలకు మరో రూ.40 వేల కోట్లను కలిపి ఈసారి బడ్జెట్‌ మొత్తం వ్యయాన్ని రూ.3,04,965 కోట్లుగా ప్రతిపాదించారు. 

పన్ను రాబడుల కింద రూ.1.38 లక్షల కోట్లు వస్తాయని 2024–25 బడ్జెట్‌లో ప్రతిపాదించగా, సవరించిన బడ్జెట్‌లో అది రూ.1.29 లక్షల కోట్లకు తగ్గింది. పన్నేతర ఆదాయం రూ.35 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేయగా, రూ.10 వేల కోట్ల మేర తగ్గి రూ.25 వేల కోట్లుగా నమోదైంది. 

2024–25లో రూ.21,636 కోట్లు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దు కింద వస్తాయని అంచనా వేయగా, రూ.19,836 కోట్లు మాత్రమే సమకూరినట్లు సవరించిన అంచనాలు వెల్లడిస్తున్నాయి. అప్పుల కింద 2024–25లో ప్రతిపాదించిన మొత్తంలో సింహభాగం సమకూరింది. అన్ని రకాల రుణాలు కలిపి రూ.62 వేల కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రూ.60 వేల కోట్లకు పైగా సమకూరాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement