
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన, జిల్లాలు, జోన్ల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈమేరకు సోమవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులతో ఉద్యోగుల విభజన ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
ఉద్యోగుల నుంచి ఆప్షన్‌లు స్వీకరించే ప్రక్రియ పూర్తయిందని, అన్ని కేడర్‌లలో సీనియారిటీ జాబితాలను సిద్ధం చేశామని ఉన్నతాధికారులు సీఎస్‌కు వివరించారు. అనంతరం సోమేశ్ మాట్లాడుతూ విభజన ప్రక్రియ గురించి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
సమావేశంలో వైద్య, మహిళా శిశు సంక్షేమ, యువజన సర్వీసులు, పర్యాటక–సాం స్కృతిక, అన్ని సంక్షేమ శాఖలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, పోలీస్, పంచాయతీరాజ్, పురపాలక, విద్యుత్, అటవీ, వ్యవసాయ, రోడ్లు భవనాలు, రవాణా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.