
ఆలోగా ‘పాలమూరు’తొలి విడత పనులు పూర్తి చేయాలి
సమీక్షలో మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
నేడు సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలి దశను ప్రాధాన్య ప్రాజెక్టుగా తీసుకుని వచ్చే డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ (6.40టీఎంసీలు), ఏదుల (6.55 టీఎంసీలు), వట్టెం (16.7 టీఎంసీలు), కరివేన (19 టీఎంసీ లు) రిజర్వాయర్‌ల పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి 50 టీఎంసీల కృష్ణా జలాలను నిల్వ చేసుకునేందుకు సర్వం సిద్ధం చేయా లని ఆదేశించారు.
ప్యాకేజీ–3 కింద నార్లాపూర్–ఏదుల రిజర్వాయర్ల మధ్య కాల్వల పనులను తక్షణమే ప్రారంభించి అక్టోబర్‌లోగా పూర్తి చేయాలన్నారు. నీటిపారుదల శాఖపై శనివారం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రియదర్శిని జూరాల జలాశయంలో పూడికను తొలగించి నిల్వ సామర్థ్యాన్ని 12 టీఎంసీలకు పునరుద్ధరించాలని ఆదేశించారు.
సెక్రటరీ ఇంటికి వెళ్లి సంతకం చేయించండి
‘శ్రీరామనవమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాచలంలో పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం–సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు అంచనా వ్యయం సవరణకు పరిపాలనాపర అనుమతులతో తక్షణమే జీవో జారీ చేయండి’అని ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షలో ఆదేశించారు. నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపేందుకు అధికారులు ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు.
సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదని అధికారులు చెప్పగా.. సెక్రటరీ ఇంటికి వెళ్లి ఫైల్‌పై సంతకం చేయించి ఈ రోజే జీవో ఇవ్వాలని ఉత్తమ్ ఆదేశించినట్టు తెలిసింది. శనివారం సెలవు కావడంతో సమావేశానికి సెక్రటరీ రాలేకపోయారని సమాచారం. భద్రాచలం పర్యటనలో సీతారామ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ సమీక్ష చేసే అవకాశం ఉంది.
ఇన్‌లెట్‌వైపు నుంచే బ్లాస్టింగ్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ఇన్‌లెట్‌వైపు నుంచి మాత్రమే డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలకు అనుమతిస్తామని, మన్నెవారిపల్లి (అచ్చంపేట) వద్ద ఉన్న అవుట్‌లెట్ వైపు నుంచి ఎట్టి పరిస్థితిలో అనుమతించబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. సొరంగాన్ని రెండు వైపుల నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు జరిపేందుకు అనుమతించాలని నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ చేసిన విజ్ఞప్తిని మంత్రి తోసిపుచ్చారు.
ఇన్‌లెట్ వైపు నుంచి టీబీఎంతో సొరంగంలో తవ్వకాలు జరుపుతుంటే పైకప్పుకూలి 8 మంది కూలీలు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌లెట్‌వైపు నుంచే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలకు అనుమతిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.