నేడు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలతో భరోసా
భద్రాద్రి జిల్లాకు న్యాయం చేయాలంటున్న ప్రతిపక్షాలు
సాక్షి ప్రతినిధి ఖమ్మం/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఎనిమిదేళ్లుగా నిర్మాణం జరుపుకొంటున్న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు తొలి ఫలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లావాసులకు అందనున్నాయి. గురువారం హైదరాబాద్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నాక సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్దకు చేరుకొని పైలాన్‌ను ఆవిష్కరి స్తారు.
ఇక్కడ సీతారామ ప్రాజెక్టులో భాగమైన రెండో పంప్‌హౌస్‌లో మధ్యాహ్నం 12:50 గంటలకు మోటార్లు స్విచ్చాన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోత లను ప్రారంభిస్తారు. అనంతరం డెలివరీ చానల్ వద్ద పొలాల్లోకి ప్రవహించే జలాలకు పూజ చేస్తా రు. అనంతరం మీడియాతో మాట్లాడి వైరాలో జర గనున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు హెలి కాప్టర్‌లో బయలుదేరతారు.
మరోవైపు అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి పంప్ హౌస్‌ను జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంక ట్‌రెడ్డి, ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్‌హౌజ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క ప్రారంభిస్తారు. కాగా, బుధవారం పంప్ హౌస్–2 వద్ద ఏర్పాట్లను, పంప్‌హౌస్–3లో ట్రయల్ రన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
వైరా సభలో రూ.2 లక్షల రుణమాఫీ
పూసుగూడెంలో కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ మధ్యాహ్నం 2.45 గంటలకు ఖమ్మం జిల్లా వైరా చేరుకుంటారు. అక్కడ 3 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించే బహి రంగ సభలో పాల్గొంటారు. ఇదేవేదికపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చెక్కు లను కొందరు రైతులకు అందజేస్తారు. ఈ సభలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు ప్రసంగించనున్నారు.
ఎనిమిదేళ్లుగా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ పేర్లతో రెండు ఎత్తిపోతల పథకాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. కానీ మహానేత మరణం తర్వాత ఈ పనులు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్ర విభజనతో ఇందిరాసాగర్ ప్రతిపాదిత స్థలం ఏపీలోకి వెళ్లిపోయింది.
దీంతో ఈ రెండు ప్రాజెక్టులను కలిపేస్తూ ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 6.5 లక్షల ఎకరాలకు గోదావరి నీరు ఇచ్చేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. 2016 ఫిబ్రవరి 16న ప్రాజెక్టు నిర్మాణ పనులకు నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు రూ.8 వేల కోట్లకు పైగా వెచ్చించగా.. మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయినా ప్రధాన కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఒక్క ఎకరాకూ నీరు అందించే అవకాశం లేకుండాపోయింది.
రాజీవ్ కెనాల్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రధాన కాల్వ 102 కి.మీ. వద్ద 9.8 కి.మీ. నిడివితో రాజీవ్ కెనాల్‌ను నిర్మించి గోదావరి నీటిని నాగార్జునసాగర్ కాల్వ ద్వారా వైరా రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్ చేశారు. తద్వారా 1.20 లక్షల ఎకరాల ఎన్‌ఎస్‌పీ ఆయకట్టుకు గోదావరి నీరు అందించే అవకాశముంది. దీంతో నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తయి, డ్రై రన్ కూడా జరగని మూడు పంప్‌హౌస్‌లను సిద్ధం చేసే పనిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఒక్కో పంప్‌హౌస్‌లో రెండేసి మోటార్లు సిద్ధం చేయడమే కాక ప్రధాన కాల్వ పెండింగ్ పనుల్లో వేగం పెంచింది.
గిరిజన జిల్లాకు అన్యాయం
సీతారామ ప్రాజెక్టు ప్రధాన పనుల కోసం నీరు, భూసేకరణ అంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టి సాగునీటిని మాత్రం ఖమ్మం జిల్లాకు తరలి స్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు ఇప్పటికే ఎన్‌ఎస్‌పీ కెనాల్ ద్వారా సాగు నీరు అందుతున్నా ఆ జిల్లాకు చెందిన మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి అదనంగా గో దావరి జలాలను తీసుకెళ్తూ భద్రాద్రికి అన్యాయం చేస్తున్నారని సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమో క్రసీ మాస్‌లైన్ పార్టీలతోపాటు పలు రైతు సంఘా లు ఆరోపిస్తున్నాయి.
ఇల్లెందు, పినపాక నియో జక వర్గాలకు గోదావరి జలాలు ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బానోతు హరిప్రియ ఆయా నియోజక వర్గాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment