
16–22 వరకు జపాన్‌లో విస్తృత పర్యటన
పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై పలు కంపెనీలతో సమావేశాలు
నేడు ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో–2025లో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. ఈ బృందంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు. ఈ నెల 16 నుంచి 22 వరకు జపాన్‌లోని టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ఆ బృందం పర్యటించనుంది.
ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో–2025లో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామి క వేత్తలు, పలువురు ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై చర్చించనున్నారు. 16న టోక్యో చేరుకుని అక్కడి భారత రాయబారి ఇచ్చే ఆతిథ్య సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. 17న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ కార్పొరేషన్, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ తదితర సంస్థలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు.
18న టొయోటా, తోషిబా సీఈవోలతో భేటీ
సీఎం రేవంత్‌రెడ్డి 18న టోక్యోలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. టోక్యో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమవుతారు. అనంతరం ఇండియన్ ఎంబసీ ఆధ్వ ర్యంలో పారిశ్రామికవేత్తలతో నిర్వహించే భేటీలో సమావేశ మవు తారు. టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి ప్రఖ్యాత కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తా రు. జపాన్ ఓవర్సీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొ రేషన్ ఫర్ ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు.
అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. 19న టోక్యో నుంచి బయలు దేరి మౌంట్ ఫుజి, అరకురయామా పార్క్‌ను సందర్శిస్తారు. 20న కిటాక్యూషు సిటీకి చేరుకుని అక్కడి మేయర్‌తో సమావేశమై ఎకో టౌన్ ప్రాజెక్టుకు సంబంధించి చర్చిస్తారు. మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్‌మెంట్ మ్యూజి యం, ఎకో టౌన్ సెంటర్‌ను సందర్శిస్తారు. 21న ఒసాకా చేరుకుని యుమెషిమాలో వరల్డ్ ఎక్స్‌పోలో తెలంగాణ పెవి లియన్‌ను ప్రారంభించి బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం ఒసాకా రివర్ ఫ్రంట్‌ను సందర్శిస్తారు. 22న ఒసాకా నుంచి హిరోషిమా చేరుకుని అక్కడి పీస్ మెమోరియల్‌ను సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్‌తో సమావేశాలు జరుపుతారు. హిరోషిమా జపాన్ – ఇండియా చాప్టర్‌తో బిజినెస్ లంచ్‌లో పాల్గొంటారు. హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం ఒసాకా నుంచి బయలు దేరి 23న ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.