బోయిన్‌పల్లి టు బోరజ్‌.. నాగ్‌పూర్‌ హైవేపై దిద్దుబాటు చర్యలు | Corrective Actions on Nagpur Highway | Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లి టు బోరజ్‌.. నాగ్‌పూర్‌ హైవేపై దిద్దుబాటు చర్యలు

Published Sun, Apr 16 2023 1:25 AM | Last Updated on Sun, Apr 16 2023 8:32 AM

Corrective Actions on Nagpur Highway - Sakshi

సాక్షి, కామారెడ్డి: ‘‘కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో టేక్రియాల్‌ చౌరస్తా వద్ద 2016లో రోడ్డు దాటే క్రమంలో కారును రెండు లారీలు ఢీకొట్టాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదు­గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తరువాత కూడా పలు ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్‌ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఎట్టకేలకు ఇప్పుడక్కడ అండర్‌ పాస్‌ నిర్మాణం జరుగుతోంది.

బ్రిడ్జి పూర్తయితే ప్రమా­దాలు ఆగిపోతాయని భావి­స్తున్నారు’’ ఇక్కడే కాదు.. హైదరాబాద్‌–­నాగ్‌­పూర్‌ కారిడార్‌గా పిలిచే 44వ నంబరు జాతీయ రహదారిపై పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం వేలాది వాహనాలు పరుగులు తీస్తుంటాయి. దీంతో రహదారిపై పలు పట్టణాలు, గ్రామాలు, చౌరస్తాల వద్ద నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఏడాదికేడాది పెరుగు­తున్నాయి.

ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించి, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి భారత జాతీయ రహదారుల నిర్వ­హణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నడుం కట్టింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి నుంచి తెలంగాణ రాష్ట్రం ముగిసి మహారాష్ట్రలోకి ప్రవేశించే బోరజ్‌ దాకా బ్లాక్‌ స్పాట్లను గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ దిద్దుబాటు చర్యలు మొద­లుపెట్టింది. ఇప్పటికే పలు చోట్ల సర్వీస్‌ రోడ్ల నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టారు. ప్రధాన సమస్యగా ఉన్న జంక్షన్లు, కూడళ్ల వద్ద అండర్‌ పాస్‌లు, వంతెనల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఏడాది, ఏడాదిన్నర కాలంలో పనులన్నీ పూర్తి చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. 

బోయిన్‌పల్లి నుంచి బోరజ్‌ దాకా....
బోయిన్‌పల్లి నుంచి మెదక్, కామారెడ్డి, నిజా­మాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల మీదుగా రాష్ట్ర సరిహద్దుల్లోని బోరజ్‌ దాకా 44వ నంబరు జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టింది. బోయి­న్‌పల్లి నుంచి కాళ్లకల్‌ దాకా 27 కిలోమీటర్ల మేర రూ.933 కోట్ల వ్యయంతో ఆరు వరుసల రహదారిని నిర్మిస్తోంది. ఇందులో ఐదు అండర్‌పాస్‌లు, నాలుగు ఫ్లై ఓవర్లున్నాయి. సుచిత్ర, డెయిరీ ఫాం, హైటెన్షన్‌ రోడ్డు, దూలపల్లి, కొంపల్లి, మేడ్చల్‌ ప్రాంతంలో ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తారు.

మెదక్‌ జిల్లా పరిధిలోకి వచ్చే రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్‌ దాబా ప్రాంతాల్లో మూడు అండర్‌ పాస్‌లు నిర్మి­స్తున్నారు. జాతీయ రహదారి నుంచి కామారెడ్డి పట్టణంలోకి ఎంటర్‌ అయ్యే నర్సన్నపల్లి చౌరస్తా, పట్టణం నుంచి బయటకు వెళ్లే టేక్రియాల్‌ చౌరస్తా వద్ద రెండు అండర్‌ పాస్‌లు నిర్మిస్తున్నారు. సదాశి­వన­గర్‌ మండలంలోని పద్మాజివాడీ చౌరస్తా వద్ద కూడా అండర్‌ పాస్‌ నిర్మాణం పనులు మొదల­య్యాయి. నిర్మల్‌ జిల్లా కడ్తాల్‌ జంక్షన్, ఆదిలా­బాద్‌ జిల్లాలోని గుడి హత్నూర్‌ జంక్షన్ల వద్ద అండర్‌ పాస్‌ల నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. 

రూ. పదకొండు వందల కోట్లతో..
రోడ్ల విస్తరణ, అండర్‌పాస్‌లు, సర్వీస్‌ రోడ్లు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.పదకొండు వందల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. బోయిన్‌­పల్లి నుంచి కాళ్లకల్‌ దాకా వంతెనలు, ఆరు­వరుసల రోడ్ల నిర్మాణానికి రూ.933 కోట్లు కేటా­యించారు. రెడ్డిపల్లి, జప్తి శివునూర్, గోల్డెన్‌ దాబా జంక్షన్, నర్సన్నపల్లి, టేక్రియాల్, పద్మా జివాడీ చౌరస్తా, కడ్తాల్, గుడి హత్నూర్‌ వద్ద అండర్‌ పాస్‌ల కోసం దాదాపు రూ.2 వందల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.

పలు అండర్‌ పాస్‌ల నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. కామారెడ్డి జిల్లాలో నర్సన్న పల్లి, టేక్రియాల్, పద్మాజివాడీ ఎక్స్‌రోడ్ల వద్ద పనులు వేగంగా నడుస్తున్నాయి. మెదక్‌ జిల్లాలోనూ పనులు కొనసాగుతున్నాయి.

ఏడాదిలోపు పూర్తి చేస్తాం...
ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 44వ నంబరు జాతీయ రహదారిపై అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు మొదలుపెట్టాం. చాలాచోట్ల సర్వీస్‌ రోడ్లను చేపట్టాం. హైదరాబాద్‌లో ఆరు వరుసల నిర్మాణం, ఫ్లై ఓవర్ల నిర్మాణాలు కూడా ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తాం. ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగి పోతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement