
చిన్నారుల అంతరంగ ఆవేదన
గుండెల్ని పిండేసిన జీడిమెట్ల ఘటన
(హైదరాబాద్) జీడిమెట్ల: ఎందుకమ్మా.. ఇంత దారుణానికి ఒడిగట్టావు. గోరుముద్దలు తినిపించి.. అల్లారుముద్దుగా పెంచి.. అనురాగాన్ని పంచి నీ ప్రాణానికి ప్రాణంగా చూశావు. కానీ.. ఇంతలోనే మా ప్రాణాలు తీసి నీవూ చనిపోయావెందుకమ్మా! కష్టమొస్తే నాన్నకు చెబితే తీర్చేవాడు కదా. మాకు ఆరోగ్య సంబంధ సమస్యలు, నీకూ అనారోగ్యం.. వీటిని తట్టుకోలేక నీ ఇద్దరు పిల్లల ఊపిరి తీశావు.
మేమేం పాపం చేశామమ్మా.. అంటూ ఆ ఇద్దరు చిన్నారి బాలురు తమ హృదయావేదనను ఇలాగే వెలిబుచ్చేవారేమో! గురువారం జీడిమెట్ల పీఎస్ పరిధిలోని బాలాజీ లే అవుట్‌లో తల్లి తేజస్విని తన ఇద్దరు కుమారులు ఆశిష్‌రెడ్డి (7), హర్షిత్‌రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి.. ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందికి దూకి తానూ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ విషాదాంత ఘటనతో స్థానికులను కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఈ దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
శుక్రవారం పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలే కనిపించాయి. ఆ కుటుంబంలో తీరని శోకమే నిండుకుంది. మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే తేజస్విని ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు. మాతృమూర్తి ఆదిలోనే ఇలా తమ ప్రాణాలను తీస్తుందని ఊహించే స్థితిలో లేని ఆ ముక్కుపచ్చలారని ఆమె ఇద్దరు కుమారులు ఆఖరి ఘడియల్లో ఎంతటి క్షోభ అనుభవించారో.. పాపం పసి పిల్లలు!