
విద్యార్థుల వ్యక్తిగత వీడియోలు తీసి లీక్ చేస్తానని బెదిరింపు
టీచర్‌ను సస్పెండ్ చేసే వరకు భోజనం చేయం..
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంగళవారం విద్యార్ధులు దాదాపు నాలుగు గంటల పాటు ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఓ విద్యార్థి స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిందని ఇంగ్లిష్ టీచర్ మూడు గంటల పాటు నిలబెట్టిన విషయం తెలిసిందే.
ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి టీచర్‌పై చర్యలు తీసుకుంటామని డీఈఓ రమేష్‌కుమార్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయి తే వారం రోజులు గడుస్తున్నా ఆ ఉపాధ్యాయురాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంగళవారం విద్యార్థులు పాఠశాల ప్రధాన గేటు వద్ద ఎండలో దాదాపు నాలుగు గంటల పాటు భోజనం చేయకుండా ధర్నా చేశారు. సంబంధిత టీచర్‌ను సస్పెండ్ చేసే వరకు మేము భోజనం చేయమని నినదించారు.
ఆమె మళ్లీ పాఠశాలకు వస్తే ఎవ్వరం పాఠశాలలో ఉండమని విద్యార్థినులు బీష్మించారు. తను విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించి, మానసికంగా వేధిస్తోందని, వాష్‌రూంకు వెళితే ఆ ఫొటోలు, వీడియోలు తీసి వాటిని బయట లీక్ చేస్తా నని భయపెడుతుందని విద్యార్థులు వాపోయారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుంచి కదిలేదిలేదని కూర్చున్నారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ రమేష్‌కుమార్ పాఠశా లకు చేరుకొని విద్యార్థులకు నచ్చచెప్పి ఆ టీచర్‌ను ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఉంచబోమని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.
బిడ్డల్లాగా చూసుకుంటారనుకుంటే...
పాఠశాలలో చదువు చెప్పే ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత బిడ్డల్లాగా చూసుకుంటారని అనుకుంటే.. వీళ్లే ఈ విధంగా ప్రవర్తించడం బాగా లేదు సార్. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ టీచర్‌ను సస్పెండ్ చేయాలి. తమ పిల్లలకు మంచి చదువు చెప్పించండి సార్.
– సత్యనారాయణ, విద్యార్థిని తండ్రి, మొలచింతపల్లి