
జగిత్యాలజోన్: ముగ్గురు పిల్లలున్న వివాహితపై కన్నేసి, మాట వినకుంటే కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆమె మృతికి కారణమైన నిందితుడు ఇల్లంతకుంట శ్రీధర్‌కు యావజ్జీవ శిక్ష, రూ 1.02 లక్షల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పునిచ్చారు. పీపీ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం కొడిమ్యాలలో నివాసం ఉండే దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. భార్య బీడీలు చుడుతూ పిల్లలను చదివిస్తోంది. వీరి ఇంటి పక్కన ఉండే ఇల్లంతకుంట శ్రీధర్ సదరు మహిళపై కన్నేశాడు. కోరిక తీర్చకపోతే చంపుతానని బెదిరించాడు.
దీంతో సదరు మహిళ తన పిల్లలతో కలిసి అదే గ్రామంలో వేరే చోటుకు అద్దె ఇంట్లోకి మారింది. అక్కడికి వెళ్లిన శ్రీధర్ మహిళకు ఇల్లు ఎందుకు అద్దెకిచ్చావని యాజమానితో గొడవకు దిగాడు. దీంతో ఆ మహిళ తిరిగి సొంతింటికి వచ్చింది. ఏప్రిల్ 14, 2019 రోజున సదరు మహిళ ఇంట్లో బీడీలు చుడుతుండగా, శ్రీధర్ వచ్చి తన కోరిక తీర్చమని వేదించాడు. ఒప్పుకోకపోవడంతో తన ఇంట్లోంచి కిరోసిన్ తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో మహిళ పిల్లలు గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా, ఇంట్లోంచి కేకలు వినపడ్డాయి. చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పివేస్తుండగా శ్రీధర్ అక్కడి నుంచి పారిపోయాడు.
సదరు మహిళను జగిత్యాలకు తరలించి, అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ అసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐలు సీహెచ్.నాగేందర్, కె.కిశోర్ కేసు నమోదు చేసి, శ్రీధర్‌ను అరెస్ట్ చేసి, చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, కేవీ.సాగర్ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో, పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడైన ఇల్లంతకుంట శ్రీధర్‌కు యావజ్జీవ శిక్షతో పాటు రూ.1.02 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.