
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు.
దీనిపై పోలీసు స్టేషన్‌లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.