డోన్ (నంద్యాల): ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయస్సు వారిది. సినిమాల ప్రభావంతోనో, సామాజిక మాధ్యమాల్లో అతి స్పందనలతోనో.. మరే కారణంతోనో ప్రేమలో పడ్డారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకు పెద్దలు అడ్డుచెప్పారు. అబ్బాయికి బలవంతంగా అక్కకూతురుతో పెళ్లి చేశారు. తమ సమస్యను పరిష్కరించుకునే మార్గాలు తెలియక మనస్తాపం చెందిన ఇద్దరు ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
కృష్ణగిరి మండలం అలంకొండ గ్రామానికి చెందిన బోయ మాదులు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు బోయ ప్రసాద్ (19) 8వ తరగతి వరకు చదువుకున్నాడు. గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు, లింగమ్మ దంపతుల కుమార్తె అనిత (16) పదో తరగతి పూర్తి చేసింది. వీరిరువురూ రెండు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. బోయ ప్రసాద్‌కు రెండు నెలల క్రితం అతని సొంత అక్క కూతురుతో వివాహం జరిపించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమికులు మంగళవారం రాత్రి వారివారి ఇళ్ల నుంచి బయటకు వచ్చి డోన్ మండల పరిధిలోని మల్యాల గ్రామం సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి అత్మహత్య చేసుకున్నారు.
చదవండి: (టీడీపీ నాయకుడి కొడుకు నిర్వాకం.. ‘రూ.30 లక్షలు తెస్తేనే కాపురం చేస్తా’)
బుధవారం ఉదయం రైల్వే ట్రాక్‌మెన్ సుధాకర్ మృతదేహాలను చూసి మల్యాల స్టేషన్ మేనేజర్ రాంబాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి వెల్దుర్తి సీఐ యుగంధర్, సీఆర్‌పీఎఫ్ పోలీస్ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిపారు.
ఆలంకొండలో విషాద ఛాయలు
కృష్ణగిరి: ప్రేమజంట గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో ఆలంకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలభై రోజుల క్రితం ఈతకెళ్లి నలుగురు చిన్నారులు కరెంట్‌షాక్‌తో మృతి చెందారు. అదే రోజు బోయ ప్రసాద్ తన అక్క కూతురుతో పెళ్లి చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మరో అమ్మాయితో కలిసి ప్రసాద్ రైలు కిందపడి మృతి చెందడం అందరినీ కలిచివేసింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామానికి తీసుకురాగా బందోబస్తు మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
►మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment