
నోటిఫైడ్ వేతనం రూ.300..
కూలీలు పొందినది రూ.213 మాత్రమే
ఆధార్ పేమెంట్స్ తప్పనిసరితో గత మూడేళ్లలో 6.1 లక్షల కుటుంబాలు 21 లక్షల మంది కార్మికుల తొలగింపు..
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో తెలంగాణకు సంబంధించి మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. జాతీయస్థాయిలో పనిదినాల కల్పనలో 7 శాతం క్షీణత నమోదు కాగా...అదే తెలంగాణలో 1.1 శాతం వృద్ధి నమోదైంది. అయితే అదే సమయంలో కుటుంబాల సగటు పనిదినాలు అనేవి మాత్రం 2023–24లో 47.71 ఉండగా, 24–25లో 45.80 కి పడిపోయాయి. కుటుంబాలకు సంబంధించి వందరోజుల పని విషయంలో ఒకేసారి 31.1 శాతానికి దిగజారింది.
ఇదే సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 32 జిల్లాలకు (హైదరాబాద్ మినహా)గాను 17 జిల్లాల్లో ఉపాధి పనుల పెరుగుదల నమోదు కాగా, 15 జిల్లాల్లో తగ్గుదల రికార్డయ్యింది. శుక్రవారం లిబ్‌టెక్ ఇండియా సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం...మొత్తం పనిదినాలు 12.1 కోట్ల నుంచి 12.2 కోట్లకు (1.1%) పెరిగాయి. అయితే జాతీయస్థాయిలో చూస్తే..పనిదినాలు మాత్రం 7% శాతం తగ్గాయి. అంటే సాపేక్షంగా తెలంగాణ పరిస్థితి ఈ విషయంలో బాగుంది.
ముఖ్యాంశాలు..
⇒ ఒక్కో ఇంటికి లభించిన సగటు పనిదినాలు 47.71 నుంచి 45.80 రోజులకు (4%) తగ్గాయి. ఎక్కువమంది పథకంలో పనిచేసినా, అందరికీ తగిన స్థాయిలో పని లభించలేదు.
⇒ 100 రోజుల పనిపొందిన కుటుంబాల సంఖ్యలో తీవ్ర పతనం.. 100 రోజులు పనిచేసిన కుటుంబాల సంఖ్య 1.35 లక్షల నుంచి 0.93 లక్షలకు (31.1%) తగ్గింది.ఇది జాతీయస్థాయి పతనం (9.5%) కంటే 3 రెట్లు అధికం.
మొదటి 3.. చివరి 3 జిల్లాలు ఇలా..
⇒ తెలంగాణలోని 32 జిల్లాల్లో 17 జిల్లాల్లో పని దినాలు పెరిగాయి. టాప్‌లో ములుగు జిల్లా +36.5%, కామారెడ్డి జిల్లా +24.6%, వరంగల్ +23.7% ఉన్నాయి. చివరి నుంచి మేడ్చల్ జిల్లా –25.3%, సంగారెడ్డి జిల్లా –19.2%, మహబూబాబాద్ జిల్లా –18.1%తో గణనీయంగా క్షీణించాయి.
ఏప్రిల్–మే లో వృద్ధి, తర్వాత క్షీణత
⇒ 2024 ఏప్రిల్‌లో +88%, మేనెలలో +35%తో పనిదినాల్లో భారీ పెరుగుదల ఉంది. కానీ జూన్ 2024 నుంచి మార్చి 2025 వరకు గత సంవత్సరం కంటే పనిదినాలు తగ్గాయి. 2024 మే 24న కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో 60% వ్యవసాయ ఖర్చుల నిబంధనల ఉల్లంఘనలపై ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఈ క్షీణత జరిగింది.
ఉపాధి కూలీల తొలగింపులు తగ్గకపోవడం, పునరుద్ధరణలో వెనుకబాటు
⇒ నికరంగా 0.91 లక్షల మంది కార్మికులు తొలగింపునకు గురయ్యారు.
⇒ దేశవ్యాప్తంగా 119 లక్షల కొత్త కార్మి కులు ఈ పథకంలో చేరగా, తెలంగాణ ఈ విషయంలో వెనుకబడింది.
⇒ ఆధార్ పేమెంట్ వ్యవస్థను తప్పనిసరి చేయడం వల్ల గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి 6.1 లక్షల కుటుంబాలు, 21లక్షల కార్మికులను తొలగించారు.
అధిక వేతన నోటిఫికేషన్ ఉన్నా, వాస్తవ వేతనంలో తీవ్ర వ్యత్యాసం..
⇒ నోటిఫైడ్ వేతనం రూ.300కి పెరిగినా, వాస్తవంగా కార్మికులు పొందిన వేతనం రూ.213 మాత్రమే.. అంటే 71% మాత్రమే
⇒ నోటిఫైడ్, వాస్తవ వేతనాల మధ్య వ్యత్యాసం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.