
సిజేరియన్ చేసిన వైద్య బృందం, కొడుకును ఎత్తుకొని సంతోషం వ్యక్తం చేస్తున్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
గోదావరిఖని జీజీహెచ్‌లో సిజేరియన్ ద్వారా కాన్పు
ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెంచారంటూ కలెక్టర్ దంపతులపై ప్రశంసలు
కోల్ సిటీ (రామగుండం): ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన సతీమణి విజయకు గో దావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ప్రసవం చేయించారు. శనివారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు రావడంతో వెంటనే జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు సిజేరియన్ చేయగా 3.6 కిలోల మగబిడ్డకు కలెక్టర్ భార్య జన్మనిచ్చారు. ఆమెకు ఇది రెండో కాన్పు.
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీహర్ష పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన సతీమణి గర్భం దాల్చినప్పటి నుంచి గోదావరిఖని జీజీ హెచ్‌లోనే పరీక్షలు చేయిస్తూ వచ్చారు. కలెక్టర్ తీరు ఇతర అధికారు లకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా చేశారంటూ ఆస్పత్రి వైద్యాధికారులు కలెక్టర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తన సతీమణికి సిజేరియన్ చేసిన వైద్య బృందం గైనిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ అరుణతోపాటు డాక్టర్ లక్ష్మి, అనెస్తీషియా డాక్టర్ భానులక్ష్మిని కలెక్టర్ అభినందించారు.