Indian Rebirth Story Of 8 Years Boy Aryan Dubey, Says His Grand Mother Is His Wife - Sakshi
Sakshi News home page

Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు!

Published Sat, Jun 17 2023 10:05 AM | Last Updated on Sat, Jun 17 2023 11:31 AM

8 Years Boy Aryan Dubey says his Grand Mother is his Wife - Sakshi

పునర్జన్మ... ఇది యావత్‌ మానవాళికీ అంతుచిక్కని ప్రశ్న. పునర్జన్మ ఉందని కొందరు అంటుంటే, అస్సలు లేదని మరికొందరు వాదిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తమ పునర్జన్మ ఇదేనంటూ పలువురు పూసగుచ్చినట్లు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పూర్‌ జిల్లాలో పునర్జన్మకు సంబంధించిన ఒక ఉదంతం కలకలం రేపుతోంది. ఎనిమిదేళ్ల కుర్రాడు తన అమ్మమ్మను తన భార్య అని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ మాటవినగానే మొదట ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ కుర్రాడు చెబుతున్న గతంలోని సంఘటనలు విన్నాక కుటుంబ సభ్యులంతా తెగ ఆశ్చర్యపోయారు.

పునర్జన్మకు సంబంధించిన ఈ విచిత్ర ఉదంతం ఎలావూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మంగల్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. జూన్‌ 15న 8 ఏళ్ల అర్యన్‌ తన తల్లితోపాటు రతన్‌పూర్‌ గ్రామానికి వచ్చాడు. ఆ కుర్రాడి తల్లి.. ‘వెళ్లి.. అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టు’ అని అతనితో చెప్పింది. వెంటనే ఆ కుర్రాడు ‘ఈమె నా అమ్మమ్మ కాదు. నా భార్య’ అని అని చెప్పాడు, అలాగే అక్కడే ఉన్న మేనమామను తన కుమారుడు అని ఆర్యన్‌ చెప్పాడు. 

ఆర్యన్‌ మాటలను తొలుత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు.  అయితే ఆ కుర్రాడు అదే విషయాన్ని పదపదే చెప్పడంతోపాటు, గతంలో వారి కుటుంబంలో జరిగిన అన్ని ఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇవన్నీ తన గత జన్మకు సంబంధించిన విషయాలని తెలిపాడు. గత జన్మలో తన పేరు మనోజ్‌ మిశ్రా అని, 8 ఏళ్ల క్రితం అంటే 2015 జనవరి 9న తాను పొలంలో పని చేస్తుండగా, అక్కడ ఒక రంధ్రం కనిపించిందని, దానిని కాలితో మూసివేసే ప్రయత్నం చేస్తుండగా  పాము కరిచిందని తెలిపాడు.

తాను వెంటనే స్పృహ కోల్పోయానని, తనను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో మృతిచెందానని చెప్పాడు.  పిల్లాడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే అక్కడున్నవారంతా హడలెత్తిపోయారు. ఇదంతా వాస్తవమేనని, ఆ కుర్రాడు గత జన్మలో మనోజ్‌ మిశ్రా అని వారు గుర్తించారు. ఆర్యన్‌ ఇంకా వివరాలు చెబుతూ తాను చనిపోయిన సమయంలో తన కుమార్తె( ఆర్యన్‌ తల్లి) గర్భవతి అని తెలిపాడు. తాను చనిపోయాక తన దశదిన కర్మలు ముగిసిన వెంటనే తన కుమార్తె రంజన.. కుమారునికి జన్మనిచ్చిందని అన్నాడు. 

ఇంత చిన్న కుర్రాడు ఇన్ని విషయాలు తెలియజేయడం చూసిన అక్కడున్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. ఆర్యన్‌ది పునర్జన్మే అంటూ వారు అందరికీ చెబుతున్నారు.  ఆర్యన్‌ తన అమ్మమ్మ నీరజ్‌ మిశ్రాను తన భార్య అని, మేనమామలైన అనుజ్‌, అజయ్‌లను తన కుమారులని, తన తల్లి రంజనను తన కుమార్తె అని చెబుతున్నాడు. 

ఆర్యన్‌ మేనమామ అజయ్‌ మాట్లాడుతూ నాలుగేళ్ల వయసు నుంచి ఆర్యన్‌ గత జన్మ విషయాలను చెబుతున్నాడని,  అయితే మేము దీనిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు నమ్మక తప్పడం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్యన్‌ చెబుతున్న విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. ఆర్యన్‌ అమ్మమ్మ నీరజ్‌ మిశ్రా ఆ కుర్రాడి మాటలు నిజమేనని చెబుతోంది. 

ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. జన జీవనం సాగుతుందిలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement