మట్టి బట్టీలకు గట్టి గిరాకీ | Strong demand for clay kilns | Sakshi
Sakshi News home page

మట్టి బట్టీలకు గట్టి గిరాకీ

Published Thu, Jan 2 2025 4:36 AM | Last Updated on Thu, Jan 2 2025 1:24 PM

Strong demand for clay kilns

దేశ విదేశాలకు ఎగుమతి  

తందూరీ మట్టి బట్టీల చిరునామా నర్సాపూర్‌ 

పరిమాణం బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ధర 

ముంబై పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి

నోరూరించే తందూరీ వంటకాల తయారీ అనగానే గుర్తొచ్చేది మట్టి బట్టీలు.. ఈ వంటకాల్లో కీలకమైన మట్టి బట్టీల తయారీకి చిరునామాగా నిలిచింది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం నర్సాపూర్‌ గ్రామం. ఈ కుగ్రామంలో తయారుచేసిన తందూరీ మట్టి బట్టీలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండటంతో, వ్యాపారం ఖండాలు దాటుతోంది. 

నర్సాపూర్‌కు చెందిన కుమ్మరి గోపాల్‌ తరతరాల నుంచి వస్తున్న కులవృత్తిని కొనసాగిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో రుచికరమైన వంటలకు ఉపయోగపడే తందూరీ మట్టి బట్టీలకు మంచి డిమాండ్‌ ఏర్పడటంతో.. బట్టీల తయారీనే కుటుంబం ఉపాధిగా ఎంచుకుంది. – దామరగిద్ద

17 ఏళ్లుగా ఇదేవృత్తి
నర్సాపూర్‌ గ్రామవాసి కుమ్మరి గోపాల్, అతడి కుటుంబ సభ్యులు 17 ఏళ్లుగా తమ కులవృత్తిలో భాగంగా బట్టీల తయారీలో నైపుణ్యం సాధించారు. మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) పెద్ద పెద్ద హోటళ్లలో మట్టి బట్టీల వినియోగాన్ని గుర్తించిన గోపాల్‌.. వాటికి డిమాండ్‌ ఉందని తెలుసుకొని నాణ్యమైన మట్టి బట్టీల తయారీని మొదలుపెట్టారు. 

ఈ బట్టీలను హైదరాబాద్, ముంబై, లాతూర్, నాందేడ్, గుల్బర్గా, చెన్నై, మైసూర్‌ (Mysore) తదితర నగరాలకు సరఫరా చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉందని తెలుసుకొని.. ముంబై పోర్టు నుంచి మస్కట్, ఖతార్, దుబాయ్‌తో పాటు ఆ్రస్టేలియా సింగపూర్, మలేసియా, అమెరికా తదితర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. 

కర్ర పెట్టెలో ప్రత్యేకంగా ప్యాక్‌ చేసి, కంటెయినర్లలో ముంబై పోర్టుకు (Mumbai Port) తరలించి.. అక్కడి నుంచి రవాణా సంస్థల సహాయంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గోపాల్‌ తెలిపారు.

కావలసిన పరిమాణాల్లో..  
స్థానికంగా లభించే మట్టితో గృహావసరాలకు ఉపయోగపడే పాత్రలతో పాటు తందూరీ బట్టీలను డ్రమ్‌ ఆకారంలో చిన్న, పెద్ద, మధ్యస్థంగా తయారు చేస్తున్నారు. మట్టిని బట్టీల తయారీ ప్రక్రియకు స్టీల్‌ బాక్స్‌లు లేదా మట్టి కవచాలను ఉపయోగిస్తారు. దీంతో వేడి బయటికి వెళ్లకుండా ఉంటుంది. 

మట్టి బట్టీల పరిమాణం మేరకు ధర రూ.500 నుంచి రూ.2వేలు పలుకుతోంది. స్టీల్, రాగి, సిమెంట్‌ బట్టీలు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తున్నాయి. వర్షాకాలంలో బట్టీల తయారీ తక్కువగా ఉంటుంది. నవంబర్‌ నుంచి వేసవికాలం వరకు ఏటా 500 నుంచి 800 వరకు బట్టీలను  తయారు చేస్తున్నారు. మట్టి బట్టీల తయారీతో గోపాల్‌ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఆధునిక పరికరాలివ్వాలి  
కులవృత్తిలో ఉన్న నైపుణ్యంతో ఆధునిక కాలం అవసరాలను గుర్తించా. ఏళ్ల తరబడి మట్టి బట్టీలు తయారు చేస్తున్నాం. వీటికి మంచి గిరాకీ ఉంది. దేశంలోని ప్రధాన పట్టణాలతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. వీటి తయారీ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆధునిక పరికరాలు అందించి ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి కల్పించవచ్చు.  
– గోపాల్,  మట్టి బట్టీల తయారీదారు, నర్సాపూర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement