
కశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో పోలీసుల చర్యలు
జిల్లా స్థాయిలోనూ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ల అప్రమత్తం
వివాదాస్పద పోస్టులను తొలగించడంతోపాటు ఆయా వ్యక్తులపై ఆరా
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాతో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంటోంది. ఇటీవల కొందరు వ్యక్తులు విద్వేషాలు వెళ్లగక్కేందుకు సోషల్ మీడియా యాప్‌లను అ్రస్తాలుగా మార్చుకుంటున్నారు. ఎదుటి వారిని రెచ్చగొట్టేలా పెట్టే అసభ్యకర పోస్టింగులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కశ్మీర్‌లో ఉగ్రదాడితో దేశంలో ఏర్పడిన సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా మరో వర్గం వ్యాఖ్యలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేయడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు.
ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూ ట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అనవసర ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు ఏవైనా ఉన్నాయా? అని పోలీసులు నింతరం ఆరా తీస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్‌ను మరింత అప్రమత్తం చేసినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక కేంద్రంతోపాటు అన్ని జిల్లాల్లోని సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ మరింత యాక్టివ్ అయినట్టు తెలిపారు.
నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫొటోలు, అత్యంత హేయమైన అసభ్యకర పదజాలంతో సోషల్‌మీడియాలో పోస్టింగ్స్ పెట్టే వారికి చెక్ పెడుతున్నారు. అలాంటి పోస్టులను వెంటనే తొలగించడంతోపాటు అవి ఎక్కడి నుంచి, ఎవరు పెడుతున్నారన్నది కూడా ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాలు లభించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పోలీసులు దీనిపై నిరంతరం నిఘా పెడుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా కోసం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇంటిగ్రేటెడ్ సోషల్ మీడియా సరై్వలెన్స్ వింగ్, సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ (స్మాష్)తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.