‘దివ్యాంగుల‌కూ స‌మానావ‌కాశాలు క‌ల్పించాలి’ | TCPWave distributed artificial legs To Disabled Persons In hyderabad | Sakshi
Sakshi News home page

‘దివ్యాంగుల‌కూ స‌మానావ‌కాశాలు క‌ల్పించాలి’

Published Mon, Jul 8 2024 6:26 PM | Last Updated on Mon, Jul 8 2024 7:00 PM

TCPWave distributed artificial legs To Disabled Persons In hyderabad

సీఎస్ఆర్ కార్య‌క్ర‌మంలో టీసీపీ వేవ్ ప్ర‌తినిధులు

 50 మందికి కృత్రిమ కాళ్ల అంద‌జేత‌

వీల్ ఛైర్లు, మూడు చ‌క్రాల సైకిళ్లు, కాలిప‌ర్స్, వాక‌ర్లు కూడా..

సాక్షి, హైద‌రాబాద్: దివ్యాంగులు కూడా మ‌న స‌మాజంలో అంద‌రితోపాటు స‌మానావ‌కాశాలు పొందాల‌ని, అందుకోసం వారిని ఆదుకునేందుకు స‌హృద‌యులు ముందుకు వ‌స్తే దివ్యాంగులు ఎన్నో అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌ర‌ని టీసీపీ వేవ్ సంస్థ యాజ‌మాన్య ప్ర‌తినిధి ప‌వ‌న్ గాది తెలిపారు. 

టెక్నాల‌జీని ఉప‌యోగించి దివ్యాంగుల జీవితాల్లో మార్పు తేవాల‌న్న‌ది త‌మ ల‌క్ష్య‌మ‌ని ఆయ‌న అన్నారు. కృత్రిమ అవ‌య‌వాల ద్వారా ఇక్క‌డికొచ్చిన దివ్యాంగులు పూర్తిస్థాయి ఆత్మ‌విశ్వాసాన్ని పొంద‌గ‌లిగార‌ని, ఇక్క‌డ అమ‌ర్చిన ప్ర‌తి ఒక్క అవ‌య‌వం వాళ్లంద‌రి సామ‌ర్థ్యాల‌ను మ‌రింత‌గా వెలికితీసేలా ఉంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం అందించిన స్ఫూర్తితో మ‌రింత‌మంది దివ్యాంగుల జీవితాల‌ను మార్చ‌గ‌ల‌మ‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు కుదిరింద‌ని ఆయ‌న అన్నారు. శ్రీ భ‌గ‌వాన్ మ‌హావీర్ విక‌లాంగ స‌హాయ‌తా స‌మితి ఆధ్వ‌ర్యంలో గుర్తించిన 50 మంది దివ్యాంగుల‌కు కృత్రిమ కాళ్లు, వీల్‌ఛైర్లు, మూడుచ‌క్రాల సైకిళ్లు, హ్యాండ్ కిట్లు, కాలిప‌ర్స్, వాక‌ర్ల లాంటివాటిని టీసీపీ వేవ్‌ సంస్థ సీఎస్ఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా అందించారు.

 

కింగ్ కోఠిలోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సంస్థ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ మేనేజ‌ర్ స్వ‌ప్న వాయువేగుల మాట్లాడుతూ, పారాలింపిక్స్ లాంటి క్రీడ‌ల్లో భార‌తీయులు ఎంతో ప్ర‌తిభ చూపిస్తున్నార‌ని.. దివ్యాంగుల‌కు కొంత సాయం అందించ‌గ‌లిగితే వాళ్లు స‌మాజంలో అంద‌రితో స‌మానంగా ముందుకొచ్చి, గౌర‌వ‌ప్ర‌ద‌మైన జీవితం గ‌డ‌ప‌గ‌ల‌ర‌ని అన్నారు. నిరుపేద నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ 50 మంది సొంతంగా ప‌రిక‌రాలు స‌మ‌కూర్చుకునే స్థితిలో లేనందున వారిని ఆదుకోవాల‌ని శ్రీ భ‌గ‌వాన్ మ‌హావీర్ విక‌లాంగ స‌హాయ‌తా స‌మితి త‌మ‌ను సంప్ర‌దించ‌గానే వెంట‌నే ముందుకు వ‌చ్చామ‌ని ఆమె తెలిపారు.

 

స‌మితివారే స్వ‌యంగా ఈ కృత్రిమ అవ‌య‌వాల‌ను త‌యారుచేసి ఇవ్వ‌డం సంతోష‌క‌ర‌మ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో 500 మంది దివ్యాంగుల‌కు ఈ త‌ర‌హా కృత్రిమ అవ‌య‌వాలు, వీల్ ఛైర్లు, వాక‌ర్లు అందజేస్తామ‌ని తెలిపారు. శ్రీ భ‌గ‌వాన్ మ‌హావీర్ విక‌లాంగ స‌హాయ‌తా స‌మితి స‌హ‌కారంతోనే తాము ఇదంతా చేయ‌గ‌లుగుతున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇంకా ఫిక్కి ఐటీ ఛైర్మ‌న్ మోహ‌న్ రాయుడు, సీనియ‌ర్ పాత్రికేయుడు, రాజ‌కీయ విశ్లేష‌కుడు డాక్ట‌ర్ సూరావ‌ఝ‌ల రాము, డీసీఎస్ఐ సీఈఓ డాక్ట‌ర్ శ్రీ‌రామ్, స‌ల‌హాదారు బుచ్చిబాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement