
ఇంటింటికీ ఇంటర్నెట్ దిశగా సర్కారు అడుగులు.. ఈ ఏడాదిలోగా 93 లక్షల ఇళ్లకు డిజిటల్ కనెక్టివిటీ
తక్కువ ఖర్చు.. నిరంతరం అపరిమిత హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు
లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయనున్న సంస్థ
20 వేల మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి
ఇంట్లోని టీవీ, కంప్యూటర్, సీసీ టీవీ మానిటర్‌గా మారేందుకు చాన్స్
కేబుల్ టీవీ చానళ్లతో పాటు టీ శాట్ చానళ్లూ అందుబాటులోకి..
ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ఒకే ఒక్క ఇంటర్‌నెట్ కనెక్షన్.. మీ నట్టింట్లోని టెలివిజన్ తెరను కంప్యూటర్‌గా (వర్చువల్ డెస్క్ టాప్) మార్చేస్తుంది. వైఫై సేవ లతో పాటు కేబుల్ టీవీ అందుబాటులోకి వస్తుంది. మీ టీవీని, లేదా సెల్‌ఫోన్‌ను సీసీ కెమెరాలతో అనుసంధానించుకోవచ్చు. కేబుల్ టీవీ చానళ్లతో పాటు పిల్లలకు పాఠాలు చెప్పే టీ శాట్ చానళ్లు కూడా చూసేందుకు వీలవుతుంది. కేబుల్ ఆపరేటర్‌కు మీరు నెలా చెల్లించే మొత్తంలోనే వీటితో పాటు యూట్యూబ్, గూగుల్, ఓటీటీ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
తక్కువ ఖర్చు తో అపరిమిత హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను నిరంతరం వినియోగించుకునే వెసులుబాటు వినియోగదారులకు దక్కుతుంది. ‘భారత్ నెట్’ప్రాజె క్టులో భాగంగా ఈ తరహా సౌకర్యాన్ని త్వరలో తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తోంది.
రూ.300కే కనెక్షన్
ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా టీ ఫైబర్ ప్రాజెక్టులో భాగంగా, ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చే దిశగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 12,751 గ్రామ పంచాయతీలను ఆప్టిక్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సీ)తో అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటివరకు 5,001 గ్రామ పంచాయతీలను ఓఎఫ్‌సీతో కనెక్ట్ చేసింది. టీ ఫైబర్ పనులను పూర్తి చేసి ఇంటింటికీ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా 2028 నాటికి రూ.500 కోట్ల మేర ఆదాయం పొందాలని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇంటింటికీ ఇంటర్‌నెట్ సేవలు అందించడంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేసేందుకు తాజాగా టీ ఫైబర్ దరఖాస్తులు ఆహా్వనిస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీనిద్వారా లోకల్ కేబుల్ ఆపరేటర్లతో పాటు సుమారు 20 వేల మంది ఫైబర్ ఆప్టిక్ టెక్నీషియన్లకు కూడా ఉపాధి లభించనుంది.
తొలి విడతలో సాంకేతిక సమస్యలు
భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా తొలి విడత రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఓఎఫ్‌సీ నెట్‌వర్క్ పనులు ప్రారంభించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామ పంచాయతీలకు ఓఎఫ్‌సీని వేసే బాధ్యతను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించారు. ఓఎఫ్‌సీ కేబుల్ లైన్లతో గ్రామాలను అనుసంధానించినా, నిర్వహణ లోపంతో (ఓవర్ ది ఎయిర్) స్తంభాలపై వేసిన కేబుల్ లైన్లను ఇష్టారీతిన తొలగించడం, ఓఎఫ్‌సీని కత్తిరించడం మూలంగా లైన్లు దెబ్బతిని కనెక్టివిటీ ప్రశ్నార్దకంగా మారింది. దేశ వ్యాప్తంగా ఇదే తరహా సమస్యలు తలెత్తడంతో ‘భారత్ నెట్’రెండో దశలో ఓఎఫ్‌సీ లైన్లు వేయడంలో ఏ తరహా సాంకేతికతను అనుసరించాలనే స్వేచ్ఛను రాష్ట్రాలకు కేంద్రం వదిలేసింది.
రింగ్ టెక్నాలజీ వైపు తెలంగాణ మొగ్గు
భారత్ నెట్ రెండో దశలో తెలంగాణ ఒక్కటే ఓఎఫ్‌సీని భూగర్భంలో వేసే ‘రింగ్ టెక్నాలజీ’వైపు మొగ్గు చూపింది. రెండో దశలో భాగంగా రాష్ట్రంలో 32 వేల కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ విస్తరించగా, మరో 3,500 కిలోమీటర్ల పొడవునా కేబుల్స్ వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ‘రింగ్ టెక్నాలజీ’విజయవంతం కావడంతో భారత్ నెట్ ప్రాజెక్టు మూడో దశలో అన్ని రాష్ట్రాలు రింగ్ టెక్నాలజీ అనుసరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా రింగ్ టెక్నాలజీ ద్వారా ఓఎఫ్‌సీ విస్తరణకు అయ్యే ఖర్చును భారత్ నెట్ ప్రాజెక్టు భరించేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో దశలోనే రింగ్ టెక్నాలజీ అనుసరించేందుకు తాము వెచ్చించిన రూ.1,779 కోట్లను కనీసం వడ్డీలేని రుణంగా అయినా ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
4 గ్రామాల్లో ఉచితంగా ప్రయోగం
టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా నాలుగు గ్రామాల్లో డిజిటలైజేషన్ చేపట్టాం. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణపేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇచ్చాం. ఈ బాధ్యతను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి 3 నెలల పాటు ఇంటర్‌నెట్ సేవలు ఉచితంగా అందిస్తాం. తర్వాత ఒక్కో వినియోగదారుడి నుంచి కనిష్టంగా సుమారు రూ.300 చొప్పున వసూలు చేస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో 70శాతం గృహాల్లో 30 శాతం లోకల్ కేబుల్ ఆపరేటర్లు, 31శాతం డీటీహెచ్, మరో 39 శాతం ఇంటర్‌నెట్ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ ఉంది. ఈ గృహాలన్నింటినీ భవిష్యత్తులో టీ ఫైబర్ పరిధిలోకి తీసుకువచ్చి నామమాత్ర చార్జీలతో అపరిమిత నిరంతర హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెస్తాం. 15 జిల్లాల్లో డిజిటల్ కనెక్టివిటీ పనులు చివరి దశలో ఉన్నాయి. – వేణు ప్రసాద్, ఎండీ, టీ ఫైబర్
టీ ఫైబర్ ప్రాజెక్టు ప్రస్తుత స్థితి
పనులు పూర్తయిన జిల్లాలు: మహబూబ్‌నగర్, జనగామ, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, వరంగల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్
పనులు పురోగతిలో ఉన్న జిల్లాలు: నల్లగొండ, నాగర్‌కర్నూల్ మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి భారత్ నెట్ మొదటి దశలో సాంకేతిక సమస్యలు తలెత్తిన జిల్లాలు: మేడ్చల్– మల్కాజిగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి అటవీ అనుమతులో పనులు ఆగిన జిల్లాలు: ఆదిలాబాద్, భూపాలపల్లి, నిర్మల్, మహబూబాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ములుగు
ప్రస్తుతం పనుల పరిస్థితి
మొత్తం పంచాయతీలు ః 12,751
పనులు పూర్తయినవి ః 5001
పనుల పురోగతి ః 3888
అటవీ అనుమతులు కావాల్సినవి ః 773
భారత్ నెట్ మొదటి దశ సమస్యలు ః 3089
హెచ్‌ఎండీఏ పరిధిలో పనులు కావాల్సినవిః 1.1కోట్ల జనాభా (18 లక్షల గృహాలు)
అపరిమితంగా ఇంటర్‌నెట్
నాలుగు నెలల క్రితం మా కాలనీలో స్మార్ట్ టీవీ ఉన్నవారికి టీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చారు. మొదట యూట్యూబ్ మాత్రమే వచ్చేది. వైఫై ద్వారా నెట్ సౌకర్యం అంతంత మాత్రమే వచ్చింది. నెల తర్వాత కొన్ని చానల్స్ ఆన్ అయ్యాయి. ప్రస్తుతం యూట్యూబ్, గూగుల్, నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వైఫై స్పీడ్ కూడా దాదాపు 20 ఎంబీపీఎస్‌కు పెరిగింది. జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఆప్టిక్ ఫైబర్ ద్వారా సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలకు ప్రతినెలా రూ.700 నుంచి రూ.900 వరకు చెల్లించాల్సి వచ్చేది. టీ ఫైబర్‌కు ప్రస్తుతం ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు.
– మిట్టే చంద్రశేఖర్, మద్దూర్, నారాయణపేట జిల్లా
అప్పుడప్పుడు సిగ్నల్స్ సమస్య వస్తోంది..
ఫైబర్ నెట్ వినియోగంలో కొంత సిగ్నల్స్ సమస్యలు ఏర్పడుతున్నాయి. కరెంట్ పోయి వచ్చిన సందర్భాల్లో సిగ్నల్స్ రావడానికి 20 నిమిషాల సమయం పడుతోంది. అయితే సిగ్నల్స్ సమస్య వచ్చినప్పుడు గ్రామంలో ఫైబర్ నెట్ ఆపరేట్ చేసే వ్యక్తికి తెలియజేయగానే వెంటనే వచ్చి సరిచేస్తున్నారు. గ్రామంలో నెట్ వినియోగించుకోవడం తెలియని వారికి వివరంగా తెలియజేస్తున్నారు. – వెంకటేశ్వర్ గౌడ్, సంగుపేట, సంగారెడ్డి జిల్లా