
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఆయన సందేశానికి ముందు 75 మంది వీణ వాయిద్య కళాకారులతో దేశభక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఇతర నృత్యాలు ఉంటాయని పేర్కొన్నారు.
శుక్రవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సుల్తానియా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరక్టర్ రాజమౌళి, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ హరికృష్ణ తదితరులతో కలిసి హెచ్‌ఐసీసీ వేదికను పరిశీలించారు. ఈనెల 8న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆహ్వానితులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.