
ట్యూషన్ మాస్టారునే బుక్ చేసిన స్టూడెంట్
జీడిమెట్ల(హైదరాబాద్): ఆ బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ఎవరూ చూడకుండా సంవత్సర కాలంగా ఇంట్లో ఐ ఫోన్ వాడుతున్నాడు. కుమారుడు ఐ ఫోన్ వాడటాన్ని గమనించిన తండ్రి.. ‘నీకు ఫోన్ ఎలా వచి్చంది’ అని నిలదీయడంతో అసలు విషయం చెప్పేశాడు. ‘మన షాపులోంచి రోజూ కొంత డబ్బు తీసి ట్యూషన్ మాస్టారుకు ఇచ్చేవాణ్ని. మాస్టారే ఈ ఫోన్ కొనిచ్చాడు’ అని బాలుడు తన తండ్రికి వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. షాపూర్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త కమల్‌జైన్. ఆయన కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. సంవత్సర కాలంగా బాలుడు తమ షాపులోంచి కొంత నగదు దొంగిలించసాగాడు. ఆ డబ్బును తనకు ట్యూషన్ చెప్పే మాస్టారుకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో బాలుడికి సదరు ట్యూషన్ మాస్టారు ఐ ఫోన్ కొనిచ్చాడు.
ఈ విషయం ఇంట్లో తెలియడంతో కుమారుడికి ట్యూషన్ చెబుతున్న వ్యక్తిపై జీడిమెట్ల పీఎస్‌లో కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ట్యూషన్ మాస్టారు సందీప్‌పై కేసు నమోదు చేశారు. సంవత్సర కాలంగా కుమారుడు తమ షాపులోంచి డబ్బులు తీస్తున్న తండ్రి పసిగట్టకపోవడం గమనార్హం. అలాగే సంవత్సర కాలంగా కుమారుడు ఇంట్లో ఫోన్ వాడుతున్నా కుటుంబ సభ్యులు చూడకపోవడం మరో విచిత్రం. ఎవరైనా పిల్లలు ఇలాంటి పనులు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలని సీఐ గడ్డం మల్లేష్ తల్లిదండ్రులకు సూచించారు.