
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు
ఇద్దరినీ మింగిన చెరువు
ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
రెండు కుటుంబాల్లో విషాదం
ఆదిలాబాద్‌రూరల్: సెలవు ఆ విద్యార్థుల చావుకొ చ్చింది. ఈత సరదా ఇద్దరు చిన్నారుల ప్రాణాలు బలిగొంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని వైజాగ్‌కు చెందిన కాంబ్డే దుర్గాప్రసాద్, సత్యభామ దంపతులు ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం ఆదిలాబాద్‌కు వచ్చారు. మావల మండల కేంద్రంలోని 170 కాలనీలో గుడిసెలు వే సుకుని నివాసం ఉంటున్నారు. వారికి రాహుల్ (9) (నాలుగో తరగతి), విశాల్ ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ మావల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్2లో చదివిస్తున్నారు.
శనివారం పాఠశాలకు సెలవు ఉండడంతో రాహుల్, విశాల్, స్నేహితుడు చిప్పకుర్తి సంజీవ్ (10)తో కలిసి ఈత కొట్టేందుకు మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకుని ఉన్న ఎర్రకుంట చెరువు వద్దకు వెళ్లారు. రాహుల్, సంజీవ్ స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. విశాల్ చెరువు చుట్టుపక్కల ఆడుకుంటూ ఉన్నాడు. కొంత సేపటికి రాహుల్, సంజీవ్ నీటిలో మునిగిపోవడంతో గమనించిన విశాల్ విషయాన్ని స్థానికులతో పాటు కుటుంబ సభ్యులకు స మాచారం అందించాడు. మావల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీయించారు. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ మార్చురీకి తరలించారు.
రెండు రోజుల్లో పుట్టిన రోజు..
గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన చిప్పకుర్తి రాజ్‌కుమార్ కుమారుడు సంజీవ్ నానమ్మ తారా బాయి వద్ద ఉండి మావల పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. మరో రెండు రోజుల్లో అతని పుట్టినరోజు ఉంది. ఇందుకోసం తారాబాయి తన పింఛన్ డబ్బులతో కొత్త బట్టలు కొనిచ్చేందుకు తీసుకెళ్దామని అనుకుంది. అంతలోనే స్నేహితులు రావడంతో వారితో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికే ఈ విషాదకర వార్త తెలియడంతో తారాబాయి అక్కడికి చేరుకుని నా కోరిక తీరక ముందే వెళ్లిపోయావా.. అంటూ గుండెలు బాదుకుంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఇరువురి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.