
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దనరావు(Industrialist Janardhan Rao) హత్యకేసులో నిందితుడు, ఆయన మనవడు కిలారు కీర్తితేజ(Keerthi Teja) నాలుగు రోజుల (Police custody) సోమవారం ముగిసింది. కీర్తితేజ తన తాతను హత్య చేసిన విధానం, ఎందుకు చేశాడో పంజాగుట్ట పోలీసులకు వివరించారు. ప్రతిరోజూ తన తాత జనార్దన్‌రావు అవమానించేవాడని.. అది భరించలేకనే ఈ ఘోరానికి పాల్పడినట్లు కీర్తితేజ వెల్లడించాడు.
ఏరోజూ తనను సొంత మనిషిగా చూడలేదని, అందరి కంటే హీనంగా చూస్తూ దారుణంగా వ్యవహరించేవాడని, అందుకే తాతను హత్య చేశానని పోలీసుల విచారణలో చెప్పాడు. సీఐ శోభన్ తెలిపిన వివరాల ప్రకారం తన తాత తనను కుటుంబంలో ఒక సభ్యుడుగా తనను ఎప్పుడూ చూసేవాడు కాదన్నాడు.
ప్రతీరోజూ తనను బెగ్గర్ అంటూ సంబోధించడమే కాకుండా ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా అవమానించేవారని కీర్తి తేజ చెప్పాడు. దీంతో స్టాఫ్ కూడా తనను చిన్నచూపు చూసేవారంటూ తెలిపాడు. ఆస్తి పంపకాలు పదవుల కేటాయింపుల్లోనూ తనను తక్కువ చేశాడని, చివరకు డైరెక్టర్ పదవి కూడా జనార్దన్‌రావు రెండవ కుమార్తె కొడుకుకు ఇచ్ఛాడని, అప్పటినుంచి తనకు, తాతకు మధ్య గొడవలు పెరిగాయని చెప్పాడు. అందుకే తాతను చంపేయాలని నిర్ణయించుకుని ప్లాన్ చేసుకున్నానని, అందులో భాగంగా ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేశానని చెప్పాడు.
హత్య జరిగిన రోజు తనకు తాతకు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని, తనకు వాటా కావాలని అడిగితే ఇయ్యను పొమ్మనడంతో కోపంతో కత్తితో కసితీరా పొడిచి చంపేసి తర్వాత అక్కడినుంచి పారిపోయానని కీర్తి తేజ తెలిపాడు. హత్య చేసిన తర్వాత బిఎస్‌మక్తా ఎల్లమ్మగూడ పక్కనే ఖాళీ స్థలంలో కత్తి, రక్తంతో కూడిన బట్టలను తగులబెట్టానని వివరించాడు. అయితే మంటల్లో కత్తి కాలిపోకుండా అలాగే ఉండడంతో పోలీసులు ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అయితే మొదటిరోజు విచారణలో కీర్తితేజ పోలీసులకు సహకరించలేదు.
ఎందుకు హత్య చేశావంటూ పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదు. ఘటనాస్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ప్రయత్నిస్తే కీర్తి తేజ సహకరించలేదు. ఏ ప్రశ్న అడిగినా నేల చూపులు చూసేవాడని పోలీసులు చెప్పారు. రెండవరోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. అప్పటినుంచి విచారణ వేగవంతమైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు పోలీసులు చెప్పారు.