
పూర్వవిద్యార్థులందరూ కలిసి కొన్ని ఏళ్లు, దశాబ్దాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నారంటే.. ఎవ్వరికైనా సరే చాలా మంచి ముచ్చటగా అనిపిస్తుంది. ఎంతోకాలం కిందట కలిసి చదువుకుని, కొన్ని సంవత్సరాలుగా.. ఒకరితో ఒకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోయిన పరిస్థితుల్లో బతుకుతెరువు బాటలో పడి యాంత్రికంగా గడుపుతున్న జీవితాలకు.. అలాంటి ఆత్మీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఒక మంచి నవనీత లేపనంలా అనిపిస్తాయనడంలో సందేహం లేదు. అందుకే అలూమ్ని, గెట్ టుగెదర్ కాన్సెప్టులతో వచ్చిన మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, 93 లాంటి సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద తిరుగులేని విజయాల్ని నమోదు చేశాయి.
ప్రస్తుతం ఆధునిక సాంకేతికత, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సోషల్ మీడియా తదితర అనేక కారణాల వల్ల.. పాత కాలం మిత్రుల ఆచూకీ కనిపెట్టడం సులువుగా మారుతున్న తరుణంలో.. ఇంకా ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. యాభయ్యేళ్ల కిందట కలిసి చదువుకున్న వృద్ధులు కూడా.. ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటూ.. అప్పటికి జీవించి ఉన్న తమ గురువులను ఆహల్వానించి సత్కరించుకుంటూ.. తమ తమ అప్పటి ఆనందానుభూతులను నెమరు వేసుకుంటూ గడుపుతున్నారంటే.. ఆ పూర్వవిద్యార్థుల సమ్మేళనాలకు ఉన్న ప్రాధాన్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
అయితే.. ఇలాంటి సమ్మేళనాలకు కొన్ని వికృత ఫలితాలు కూడా ఉంటాయని తెలిస్తే మనం నివ్వెరపోతాం. ఆత్మీయ సమ్మేళనాల పుణ్యమాని చిన్నప్పటి ప్రేమానుబంధాలు తిరిగి మొగ్గతొడిగే సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. పరిస్థితుల్ని బట్టి వారి మధ్య ఆత్మీయ బంధాలు బలపడుతుంటాయి. కానీ.. పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో హైస్కూలు జీవితం నాటి ప్రియుడి కాంటాక్ట్ దొరకడం, దానిని వాడుకుంటూ భర్తకు తెలియకుండా వివాహేతర సంబంధం కొనసాగించడం అనేది వింటేనే వెగటు పుట్టిస్తుంది. అలాంటిది.. ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం అన్నెం పున్నెం ఎరుగని, తన కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను ఒక తల్లి తన చేతులతోనే కడతేర్చిందంటే.. మనం నిర్ఘాంతపోతాం. కడుపు మండుతుంది. పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు ఇలాంటి వికృత ఫలితాలను కూడా ఇస్తున్నాయా? అని ఆవేదన చెందుతాం. సంగారెడ్డిలో వెలుగుచూసిన సంఘటన సమాజంలో పతనమవుతున్న నైతిక విలువల తీరును, ఒక మంచి అనుభూతి కోసం జరిగే మంచి పనులను ఎలాంటి వికృత పోకడలతో భ్రష్టు పట్టిస్తున్నారనే వైనాన్ని తెలుసుకోవడానికి మంచి ఉదాహరణ అవుతోంది.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో ఇటీవల ఒక దారుణం జరిగింది. రజిత- చెన్నయ్య దంపతుల పిల్లలు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. తల్లి రజిత కడుపునొప్పితో విలవిల్లాడుతూ ఆస్పత్రి పాలైంది. భర్తతో తగాదాలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమె ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి పెట్టి చంపేసి, తాను ఆత్మహత్యకు పాల్పడిందని తొలుత పోలీసులు భావించారు. భర్త పాత్రపై అనుమానాలు వచ్చాయి. షాపు నుంచి తెచ్చిన పెరుగు కలిపి పెట్టానని, అంతకుమించి ఇంకేం తెలియదని ఆ తల్లి బుకాయించే ప్రయత్నమూ చేసింది. కానీ అసలు వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి.
రజిత అలియాస్ లావణ్య ఇంటర్మీడియట్ చదువుతుండగా 2013లో చెన్నయ్యతో పెళ్లయింది. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ కలిగారు. ఆరునెలలుగా రజిత టెన్త్ క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల ఆ ఆత్మీయ సమ్మేళనం కూడా జరిగింది. అప్పటినుంచి.. హైస్కూలు నాటి ప్రియుడు శివతో ఆమె అనుబంధం పెరిగింది. అది వివాహేతర సబంధానికి దారితీసింది. పెళ్లిచేసుకోమని అడిగింది. అయితే ముగ్గురు పిల్లల తల్లిని ఎలాచేసుకుంటానంటూ శివ తిరస్కరించాడు. పిల్లల అడ్డు తొలగితే పోతుందని వారిద్దరూ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పిల్లలను చంపేస్తే ఆ నేరం భర్త మీదకు వెళుతుందని కూడా ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. మొత్తానికి రజిత.. పెరుగన్నంలో విషం కలిపి ముగ్గురు పిల్లలకు తినిపించి, వారి గొంతు నులిమి చంపేసింది. తాను కడుపునొప్పితో బాధపడుతున్నట్టుగా నాటకమాడింది గానీ.. పోలీసుల విచారణలో బాగోతం మొత్తం బయటపడింది. వివాహేతర సంబంధం కోసం, ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండడం కోసం పిల్లల్ని తల్లులే కడతేర్చే దుర్మార్గాలు మనం ఇంకా అనేకం సమాజంలో చూస్తున్నాం. కానీ.. అలాంటి ఒక దుర్మార్గానికి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మూలకారణం కావడం ఇక్కడ శోచనీయమైన విషయం.
పూర్వవిద్యార్థుల సమ్మేళనాలు ఎంతో గొప్పవి. జీవితంలో పసితనం నాటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు కొన్ని దశాబ్దాల యెడబాటు తర్వాత.. మళ్లీ చిగురించడం మానసికంగా గొప్ప ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి గెట్ టుగెదర్ కార్యక్రమాల వల్ల.. యాంత్రికంగా మారుతున్న జీవితాల్లో తిరిగి జీవనోత్సాహాన్ని నింపుకోగలుగుతారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలాచోట్ల బాగా సక్సెస్ అవుతుంటాయి. అయితే ఇంత మంచి కార్యక్రమాలు కూడా కొన్ని వికృత ఫలితాలకు దారితీస్తున్నాయని తెలిస్తే బాధ కలుగుతుంది. రజిత- శివ లాంటి వాళ్లు ఇలాంటి కార్యక్రమాలనే సాటి సమాజం అనుమానించే విధంగా చేస్తున్నారనడంలో సందేహం లేదు. నైతిక, సామాజిక విలువల స్పృహ లేకపోవడం మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తుందని తెలుసుకోవడానికి, అమృతాన్ని అందించిన క్షీరసాగరమధనంలోంచే గరళం కూడా పుడుతుందని గ్రహించడానికి ఇది మంచి ఉదాహరణ.
:: ఎం.రాజేశ్వరి