
కూటమికి ఓట్లేసి మోసపోయాం
● సూపర్‌సిక్స్ హామీలపై చంద్రబాబు నాన్చుతున్నారు ● అధికారంలోకి వచ్చి పది నెలలవుతున్నా ఒక్క హామీని నెరవేర్చ లేదు ● పది నెలల్లో రూ.లక్ష నుంచి రూ.ఒకటిన్నర లక్ష వరకు నష్టపోయాం ● సూపర్ సిక్స్ హామీలపై నిట్టూర్పులు ● బాబు మోసాలను ఎండగడుతూనే ఉంటాం : భూమన అభినయ్‌రెడ్డి
‘బాబు గారడీ మాటలకు పడిపోయాం. సూపర్ సిక్స్ అంటే ఉప్పొంగిపోయాం. గతంలోకంటే అధికంగా లబ్ధి పొందొచ్చని ఆశపడ్డాం. కానీ మా ఆశలపై నీళ్లు చల్లారు. ఓట్లు వేయించుకుని కూటమి నేతలు నిలువునా ముంచేశారు. ఇదిగో సూపర్ సిక్స్.. అదిగో సూపర్ సిక్స్ అంటూ బురిడీ కొట్టిస్తున్నారు..’ అంటూ తిరుపతి నగర వాసులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పది నెలల కాలంలో తమకు జరిగిన నష్టాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జగనన్న ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని.. తమకు తగిన శాస్తి జరిగిందని.. వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఎదుట తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
హామీలు అమలు చేయలేదంటూ
కరపత్రాలను చూపిస్తున్న ఆటో డ్రైవర్ కుటుంబం
బాబు ఘరానా మోసం
ఎన్నికల్లో నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సూపర్‌సిక్స్ హామీలను గాలికి వదిలేసి ప్రజలను మోసగించారని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త భూమన అభినయ్‌రెడ్డి మండిపడ్డారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగ భృతి, రైతు నేస్తం, మహిళలకు ఉచిత బస్సు వంటి సూపర్‌సిక్స్ హామీలలో ఏ ఒక్కటీ ప్రజలకు అందక విలవిల్లాడుతున్నారని వాపోయారు. అధికార దాహంతో ప్రతిసారీ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో జగనన్న అందించిన సంక్షేమ పథకాలతో ప్రతి పేద, బడుగు కుటుంబాలు ఎంతో సుఖపడ్డాయని గుర్తుచేశారు. జగనన్నకు ఓట్లు వేయనందుకు ప్రజలు ఎంతో బాధపడుతున్నారన్నారు. అయినా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, కార్పొరేటర్ తమ్ముడు గణేష్, లడ్డూ భాస్కర్, వార్డు అధ్యక్షులు వెంకటేష్‌రాయల్, సోమశేఖర్‌రెడ్డి, కరాటి శీను, పార్టీ నాయకులు సాకం ప్రభాకర్, షేక్ ఇమ్రాన్‌బాషా, దినేష్‌రాయల్, కోదండ, మల్లం రవి, కిరణ్, మోహన్‌రాజ్ పాల్గొన్నారు.
తిరుపతి మంగళం: ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకంటే మూడింతలు ఎక్కువగా ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో పదేపదే చెబితే నమ్మి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశాం.. ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నా ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో నిలువునా మోసపోయాం’ అంటూ తిరుపతి 3వ డివిజన్‌లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన శనివారం ఇంటింటికీ వెళ్లి గత జగనన్న ప్రభుత్వంలో ఏయే సంక్షేమ పథకాలు పొందారు.. కూటమి ప్రభుత్వంలో ఏ పథకాలు పొందారన్న విషయాలపై స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీల్లో ఇప్పటి వరకు ఏవైనా నెరవేర్చారా..? అని ఆరా తీశారు. చంద్రబాబు ఎన్నికల్లో చెప్పారే గానీ ఇంతవరకు ఆ పథకాలేవీ రాలేదని.. ఎలాంటి లబ్ధి చేకూరలేదని ప్రజలు చెప్పుకొచ్చారు. దేవుడి లాంటి జగనన్నను కాదనుకుని చంద్రబాబుకు ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగిందని కుమిలిపోయారు.
మూడు నామాలు పెట్టారు
జగనన్న పాలనలో రూ.9లక్షలకు పైగా లబ్ధిపొందాం. కూటమి ప్రభుత్వంలో రూ.87వేల వరకు నష్టపోయాం. జగనన్నకు చేసి ద్రోహానికి తగిన ఫలితం అనుభవిస్తున్నాం. చంద్రబాబు హామీలను నమ్మినందుకు మాకు తగిన బుద్ధి చెప్పారు. మూడు పార్టీలు కలిసి మూడు నామాలు పెట్టారు.
– కౌసల్య, లెనిన్‌నగర్ తిరుపతి
పేదలపాలిటి దేవుడు జగనన్న
జగనన్న ప్రభుత్వంలో రూ.12లక్షల వరకు లబ్ధి పొందాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు రూ.86 వేల వరకు నష్టపోయాం. పేదలపాలిటి దేవుడు జగనన్న. జగనన్న లేనిలోటు మా జీవితాల్లో కొట్టుచ్చినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు పాలనలో మా జీవితాలు చీకటి అలముకుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు.
– సరోజమ్మ, లెనిన్‌నగర్, తిరుపతి
రూ.1.41 లక్షల నష్టం
గత జగనన్న పాలనలో రూ.7లక్షలకు పైగా లబ్ధిపొందాం. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో సుమారు రూ.1, 41లక్షలు నష్టపోయాం. దేశంలోనే ఏ నాయకుడూ అందించలేనన్ని సంక్షేమ పథకాలు అందించిన జగన్‌మోహన్‌రెడ్డిని కాదనుకుని కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి మోసపోయాం.
– కాంచన, లెనిన్‌నగర్, 3వ డివిజన్, తిరుపతి

కూటమికి ఓట్లేసి మోసపోయాం

కూటమికి ఓట్లేసి మోసపోయాం

కూటమికి ఓట్లేసి మోసపోయాం