
కాలువలోకి దూసుకెళ్లిన శ్రీసిటీ బస్సు ●
● 22 మందికి స్వల్ప గాయాలు
నాగలాపురం: పెను ప్రమాదం తప్పింది. శ్రీసిటీలోని ఓ కంపెనీకి చెందిన బస్సు అతివేగంగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ సునీల్ తెలిపిన వివరాల మేరకు.. శ్రీసిటీలోని ఓ కంపెనీకి చెందిన బస్సు కార్మికులను ఎక్కించుకుని నాగలాపురానికి వస్తోంది. మార్గమధ్యంలో వేంబాకం దళితవాడ వద్ద బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో మొత్తం 35 మంది కార్మికులుండగా.. అందులో 22 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాగలాపురం పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం 9 మందిని నగరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇందులో బస్సు డ్రైవర్ అరవింద్‌కు ఊపిరి పీల్చుకోవడంలో కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. బస్సు వేగంగా నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.
వడ దెబ్బతో కూలీ మృతి
వాకాడు: వడ దెబ్బ తగిలి కూలీ మృతి చెందిన ఘటన శనివారం మండల కేంద్రమైన వాకాడులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. వాకాడు టెంకాయతోపు కాలనీకి చెందిన బండి మునీంద్ర(27) దినసరి కూలీ. రోజూలాగే కూలి పనులు చేసుకుంటున్న సమయంలో మునీంద్ర ఎండ తీవ్రతను తట్టులేక సొమ్మసిల్లి పడిపోయాడు. హుటా హుటీన వాకాడు ఆస్పత్రికి తరలించేలోపే మునీంద్ర మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్వర్ణసాగరం ట్రస్టు నిర్వాహకుడు దామా విజయ్ కుమార్ మృతుడి కుటుంబానికి రూ.5 వేలు నగదు సాయం అందించారు.