
భూ భారతి
భూ సమస్యల పరిష్కారానికే
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
● పరిగి, పూడూరులో అవగాహన సదస్సులు ● హాజరైన స్పీకర్ ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి
పరిగి/పూడూరు: రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సందర్శకుల కోసం నిర్మించిన గదిని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతు భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ముందుగా పైలెట్ మండలాల్లో.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూ భారతి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించాలని ఎమ్మెల్యే.. మంత్రిని కోరారు. స్పందించిన ఆయన నూతన భవన నిర్మాణానికి నివేదికలు పంపాలని కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి సామాన్య ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురి చేసిందని, పైసలిస్తే రాత్రికి రాత్రే రైతుల పట్టాలు మార్పిడి చేశారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రమైన పూడూరులో భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ధరణికి వ్యతిరేకంగా పోరాటం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి రైతులకు న్యాయం చేశామన్నారు. భూ భారతి ద్వారా కొత్త ఆర్‌ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలను సులభతరంగా పరిష్కారిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి భూ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ భూ భారతి చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. గతంలో స్లాట్ బుక్ అయితే రిజిస్ట్రేషన్ జరిగేవని.. దీంతో అసలు లబ్ధిదారులకు నష్టం జరిగేదన్నారు. కొత్త చట్టం ప్రకారం భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా సర్వే రిపోర్ట్ అప్‌లోడ్ చేస్తేనే రిజిస్ట్రేషన్ అయ్యి కొత్త పట్టాదారు పాసు పుస్తకం వస్తుందన్నారు. వారసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, ఎస్పీ నారాయణరెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు భరత్ గౌడ్, లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.