
సెలవులు భారం
మిత్రులు దూరం..
అమ్మానాన్నలు
లేకపోవడంతో..
మాది మాల్ మండలం నేరెళ్లపల్లి. పదేళ్ల క్రితమే ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అమ్మ చనిపోయింది. ఆ తర్వాత అనారోగ్యంతో నాన్న కూడా చనిపోయాడు. నాతో పాటు తమ్ముడు ఉదయ్ కిరణ్ కూడా ఉన్నాడు. బంధువులు ఉన్నా.. ఎవరూ దగ్గరకు తీసుకోలేదు. అప్పటి నుంచి మేము ఒంటరి అయ్యాం. అప్పుడప్పుడు మా మామయ్య వచ్చి చూసి వెళ్తాడు. అమ్మానాన్నలు లేకపోవడంతో వేసవి సెలవులు వచ్చినా.. ఇంటికి వెళ్లలేని పరిస్థితి. వీఎం హోంలోనే ఉండిపోతాం. – రాంచరణ్, 8వ తరగతి
అక్కను తీసుకెళ్లారు కానీ..
మాది వలిగొండ. అమ్మనాన్నలు లేరు. చిన్నప్పుడే వాళ్లు నన్ను వదిలి వెళ్లారు. ఆ తర్వాత రామన్నపేటలోని మా అమ్మమ్మ, తాతయ్యలే నన్ను చేరదీశారు. వారికి సరైన ఆర్థిక స్తోమత లేకపోవడంతో నన్ను వీఎం హోంలో చేర్చారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు. మా అక్క శ్రవంతి కూడా ఇక్కడే చదువుకుంది. పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియగానే ఆమెను వెంట తీసుకెళ్లారు. కానీ నన్ను ఇక్కడే ఉంచారు. అందరిలాగే నాకు కూడా ఇంటికి వెళ్లాలని ఉంది. అమ్మానాన్నా లేరు కానీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి.
– శ్రవణ్‌కుమార్, 9వ తరగతి
బాధగా ఉంది
మాది వికారాబాద్ జిల్లా జిన్నారం గ్రామం. చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోయయారు. ఎనిమిదేళ్ల క్రితం
తాత, అమ్మమ్మ నన్ను వీఎం హోంలో చేర్పించారు. వాళ్లు ఏడాదికి ఒకసారి వచ్చి చూసి వెళ్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడంతో మిత్రులంతా వాళ్ల సొంతూళ్లకు వెళ్తున్నారు. కానీ నేను మాత్రం గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే ఒంటరిగా ఉంటున్నా. ఇప్పటి వరకు ఊరికి కూడా వెళ్ల లేదు. సొంతూరిని గుర్తుపట్టలేను. నాకు కూడా మా గ్రామానికి వెళ్లాలని ఉంది. కానీ ఏం చేస్తాం. నన్ను తీసుకెళ్లే వారు లేరు. నాకు ఎవరూ లేరనే బాధకన్నా.. ఇప్పటి వరకు తోడుగా ఉన్న మిత్రులు కూడా నన్ను వదిలి వెళ్తుంటే బాధగా ఉంది.
– వై.శ్రీశైలం, 8వ తరగతి
వీఎం హోంలోనే అనాథ విద్యార్థులు ● స్నేహితులు ఇళ్లకు వెళ్తుంటే చెమ్మగిల్లుతున్న కళ్లు
హుడాకాంప్లెక్స్: వార్షిక పరీక్షలు ముగిశాయి. ఎండలు భగ్గున మండుతుండటంతో ప్రభుత్వం విద్యార్థులకు సేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు వచ్చి వెంట తీసుకెళ్లారు. అయితే సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమంలో చదువుతున్న 60 మంది మాత్రం సెలవుల్లోనూ వసతి గృహానికే పరిమితం అవుతున్నారు. ఇక్కడ 800 మంది పిల్లలు చదువుతున్నారు. వీరిలో అమ్మానాన్నలిద్దరూ చనిపోయిన వారితో పాటు సింగిల్ పేరెంట్ పిల్లలు కూడా ఉంటున్నారు. పాఠశాలకు సెలవులు కావడంతో వీరంతా తమ తండ్రి/ తల్లి/ గార్డియన్ వెంట సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే ఏ ఆదరణ లేని వారు మాత్రం భారంగా అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పటి వరకు తమతో ఆడుకున్న మిత్రులు నెలరోజుల పాటు దూరం కానున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సెలవులు భారం

సెలవులు భారం

సెలవులు భారం