‘గృహజ్యోతి’లో చేతివాటం తగదు
● సీపీఎం నాయకుల ఆందోళన ● బిల్లులు ఎక్కువ చేసి ఇస్తున్నారని ఆరోపణ ● ఏడీ కార్యాలయం ఎదుట నిరసన
తాండూరు టౌన్: గృహజ్యోతి పథకం సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం తాండూరులోని ఏడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. గృహజ్యోతి పథకం కింద పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, విద్యుత్ సిబ్బంది అధిక రీడింగ్ చూపించి, బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంటికి కొత్త మీటర్ పెట్టాలంటే రూ.8 వేలు చెల్లించాలని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ఏఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 200 యూనిట్లకు జీరోబిల్లు ఇవ్వాల్సిన విద్యుత్ సిబ్బంది, అధిక రీడింగ్ తీసి బిల్లు చెల్లించమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గృహజ్యోతి పథకం సక్రమంగా కొనసాగేలా చూడాలన్నారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు సురేష్, సతీష్, మల్కయ్య, బాలస్వామి, సంజీవ్, శిలాస్, ఎల్లయ్య, ఉదయ్, అంజయ్య, వినోద్, శివ తదితరులు పాల్గొన్నారు.


