అన్నింటా ‘ఆదర్శమే’
● కార్పొరేట్‌కు దీటుగా బోధన ● ఆంగ్ల మాధ్యమం, కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్, స్కాలర్ షిప్, మౌలిక సదుపాయాల కల్పన ● రేపే ప్రవేశ పరీక్ష ● సద్వినియోగం చేసుకోవాలంటున్నప్రిన్సిపాల్ కృష్ణకుమార్
నవాబుపేట: పిల్లల బంగారు భవిష్యత్తే తల్లిదండ్రుల లక్ష్యం. ఇందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. రోజురోజుకూ ఆంగ్ల మాధ్యమానికి ఆదరణ పెరుగుతుండటంతో ఆ దిశగా చదివించాలని ఆశపడుతుంటారు. ఇందుకు చక్కటి వేదికగా నిలుస్తోంది నవాబుపేటలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల. ఇక్కడ నిరుపేదల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతోంది. అన్ని సదుపాయాలు కలిస్తూ ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారు. ఉచిత విద్య తోపాటు పక్కా భవనాలు, ల్యాబ్, లైబ్రరీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశిస్తే ఇంటర్ వరకు అక్కడే చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 27న ఆరో తరగతిలో ప్రవేశానికి ఎంట్రెస్ టెస్ట్ నిర్వహించనున్నారు.
చదువులో రాణిస్తున్న విద్యార్థులు
నవాబుపేట ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాలలో సీటు పొందేందకు ఎక్కువ మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. 2013లో స్కూల్ ప్రారంభం కాగా ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకు 447 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్ చదువుతున్న బాలికలకు హాస్టల్ వసతి ఉంది. ప్రస్తుతం 100 మంది విద్యార్థునులు వసతి గృహంలో ఉంటున్నారు.
కల్పిస్తున్న వసతులు
నవాబుపేట ఆదర్శ పాఠశాలలో చదివే విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. విశాలమైన తరగతి గదులు, ల్యాబ్ సౌకర్యం, ఉచిత పుస్తకాలు, దుస్తులు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, మధ్యాహ్న భోజనం, ప్రత్యేక తరగతులు, కాస్మోటిక్ కిట్లు, ఎన్‌సీసీ శిక్షణ, ఎంసెట్, ఎన్‌ఐటీ, పోలీస్ శిక్షణ తదితర కోచింగ్ ఇస్తున్నారు.
రేపే ప్రవేశ పరీక్ష
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27న పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 7 నుంచి 10వ తరగతి వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం
ఇక్కడ చదివే విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. అంతేకాకుండా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రత్యేక చొరవతో మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు కూడా కష్టపడి చదువుతున్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– కృష్ణకుమార్, ప్రిన్సిపాల్, నవాబుపేట ఆదర్శ పాఠశాల
ఉత్తీర్ణతలో మేటి
పాఠశాల ప్రారంభం నుంచే పది, ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీలో నికితకు 470 మార్కులకు గాను 456 మార్కు లు వచ్చాయి. బైపీసీలో తేజశ్రీకి 440లకు 413 మార్కులు, సీఈసీలో పల్లవికి 500కు గాను 370 మార్కులు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో అనూషాకు 1000 మార్కులకు గాను 913 మార్కులు, బైపీసీలో పవిత్రకు 1000కి 932 మార్కులు, సీఈసీలో నవ్యకు 1000కి 864 మార్కులు వచ్చాయి.
ఇంటర్ మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో 8మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
పలువురు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు.
వాయిద్య విభాగంలో 10వ తరగతి చదివిన ఓ విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది.
భరతనాట్యం, కూచిపూడి, సైన్స్‌ఫెయిర్ పోటీల్లో పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.
మరికొంత మంది జిల్లా స్థాయిలో రాణించారు.
అన్నింటా ‘ఆదర్శమే’


