
జూన్ 2 నుంచి ‘భూ భారతి ’
కొడంగల్: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పర్సాపూర్‌లో భూ భారతి ఆర్‌ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఆర్‌ఓఆర్ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, నిషేధిత భూములు, ఆర్‌ఓఆర్‌లో మార్పులు చేర్పులు, సాదా బైనామా వంటి సేవలు సులభంగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని వివరించారు. భూ సమస్యలు పరిష్కారమైతేనే రైతు బీమా, రైతు భరోసా, రుణ మాఫీ ఇతర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉంచుతామన్నారు. జూన్ 2వ తేదీ నుంచి నూతన చట్టం భూ భారతి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, నందారం ప్రశాంత్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీఓ ఉషశ్రీ, మండల వ్యవసాయాధికారి తులసి తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌ఓఆర్ చట్టంతోనే భూ సమస్యలకు పరిష్కారం
ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్
కలెక్టర్ ప్రతీక్ జైన్