ఆస్తుల వేలంకు... గంట కొట్టేశారు | - | Sakshi
Sakshi News home page

ఆస్తుల వేలంకు... గంట కొట్టేశారు

Published Sun, Mar 24 2024 12:20 AM | Last Updated on Sun, Mar 24 2024 8:03 AM

- - Sakshi

డబ్బు సంచులతో వస్తారని ఎదురు చూసిన టీడీపీ కార్యకర్తల్లో నైరాశ్యం

‘గంటా’ ఆస్తుల వేలంపై చీపురుపల్లిలో జోరుగా చర్చ

మంత్రి బొత్స పేరుతో ఐవీఆర్‌ఎస్‌ ఫేక్‌ సర్వేలు

బొత్సకు సంపూర్ణ మద్దతు లభించడంతో కంగుతిన్న పారాచ్యూట్‌ బ్యాచ్‌

చీపురుపల్లి: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్న చందగా చీపురుపల్లి టీడీపీ శ్రేణుల పరిస్థితి మారింది. గంటా వస్తారు.. డబ్బు సంచులు తెస్తారు.. వాహనాలు ఇస్తారు.. కావాల్సినవన్నీ సమకూర్చుతారని ఆశగా ఎదురు చూశారు. ఊహాలోకంలో విహరించారు. ఇప్పుడు గంటా ఆస్తుల వేలంపాటకు బ్యాంకులు గంట మోగించడంతో.. ఎదురు చూపులన్నీ గాలిలో కలిసినట్లేనా.. సంభాషణలన్నీ నీటి మీద రాతలేనా... అయ్యో ఎంతపనైపోయిందంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. చీపురుపల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై పోటీకు విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వెళ్లమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి గంటా వస్తే.. డబ్బుకు కొదవ ఉండదు.. ఎంతకావాలంటే అంత నొక్కేయవచ్చు అని గత కొంత కాలంగా కొందరు నాయకులు, కార్యకర్తలు ఆశగా ఎదురుచూశారు. తాజాగా గంటాకు చెందిన ఆస్తుల వేలంకు ఇండియన్‌ బ్యాంక్‌ శుక్రవారం నోటీసులు ఇచ్చిందన్న వార్త తెలియడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఏదో అనుకున్నాం గానీ పారాచ్యూట్‌ నేత ఇంతటి ఘనుడా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు కొందరు గుసగుసలాడుకుంటున్నారు. బయటకు పెద్ద మనిషిలా కనిపించినా బ్యాంకులకు సకాలంలో డబ్బులు చెల్లించని పెద్ద మనిషి అనుకోలేదంటూ రచ్చబండలపై మాట్లాడుకోవడం గమనార్హం.

‘గంటా’ ఆస్తుల వేలంకు నోటీసులు....
విశాఖపట్టణంలోని వన్‌టౌన్‌లో ప్రత్యూష రిసోర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్రారంభ సమయంలో డైరెక్టర్‌గా కొనసాగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం హామీదారునిగా ఉన్నారు. ఈ కంపెనీ ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఒక దఫా తీసుకున్న రుణం రూ.390.58 కోట్లుగా బ్యాంక్‌ అధికారులు గుర్తించారు. తిరిగి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఆస్తులను ఏప్రిల్‌ 16న వేలం వేయనున్నట్టు ఈ నెల 18న ఇండియన్‌ బ్యాంక్‌ నోటీసులు ఇచ్చింది.

ఐవీఆర్‌ఎస్‌తో ఫేక్‌ సర్వేలకు దిగిన పారాచ్యూట్‌ బ్యాచ్‌..
ఇదిలా ఉండగా బ్యాంక్‌ రుణాలు ఎగ్గొట్టి, ఆస్తుల వేలం వరకు వచ్చిన పారాచ్యూట్‌ బ్యాచ్‌ రాజకీయాల్లో కూడా ఫేక్‌ సర్వేలకు దిగింది. పారాచ్యూట్‌ నేత గంటా శ్రీనివాసరావు చీపురుపల్లిలో బొత్సపై పోటీ చేసే ధైర్యం లేక సర్వేలు ద్వారా మంత్రి బొత్స ఇమేజ్‌ను తెలుసుకునేందుకు పన్నాగం పన్నారు. దీని కోసం పారాచ్యూట్‌ బ్యాచ్‌ ఫేక్‌ ఐవీఆర్‌ఎస్‌ సర్వేను చేపట్టినట్టు తెలుస్తోంది. గత రెండు రోజులు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా బొత్స సత్యనారాయణకు ఓటు వేయాలంటే ఒకటి నొక్కండి.. లేదంటే రెండు నొక్కండి అంటూ ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో మంత్రి బొత్సకు సంపూర్ణ మద్దతు లభించడంతో పారాచ్యూట్‌ బ్యాచ్‌తో బాటు నేత కూడా కంగుతిన్నట్టు సమచారం. ఐవీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫోన్‌ కాల్స్‌ అన్నీ ఒకటే నొక్కడంతో ఏం చేయాలో వారికి తోచలేదు. మొత్తానికి చీపురుపల్లిలో గంట మోగించలేమన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement