
‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వతిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఐదేళ్లుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళనలు చేస్తున్నా.. వాటిని అమలుచేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గంధం మదన్, నందిమళ్ల రాములు, రత్తయ్య, రవి, విజయ్‌కుమార్, రామచంద్రయ్య, చిన్ననాగన్న తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ పోరులో
సత్తా చాటుదాం : బీజేపీ
అమరచింత: గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కిష్టంపల్లిలో జరిగిన మండలస్థాయి బూత్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్న ఘనత కేంద్రానిదేనన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అమరచింత, ఆత్మకూర్, మక్తల్ పురపాలికలు బీజేపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షురాలు మంగ లావణ్య, నాయకులు మేర్వ రాజు, హరీశ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌డబ్ల్యూఎఫ్
కార్యవర్గం ఎన్నిక
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వనపర్తి డిపో ఎస్‌డౠ్ల్యఎఫ్ (సీఐటీయూ) కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు తెలిపారు. అధ్యక్షుడిగా ఏజీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా నర్సింహ, నారాయణ, కార్యదర్శిగా నాగేశ్వర్, సహాయ కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా కురుమయ్య, ప్రచార కార్యదర్శిగా గోవర్ధన్, మహిళా కన్వీనర్‌గా జానకి, సభ్యులుగా రాములు, శాంతన్న, శేఖరయ్య, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అంతకుముందు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లేకపోవడంతో యాజమాన్యం కార్మికుల హక్కులను హరిస్తోందని, పని గంటలు పెంచి, సింగిల్ క్రూ డ్యూటీ పెంచి నామమాత్రపు ఓవర్‌టైం ఇస్తూ కార్మికుల శ్రమ, శక్తిని హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని, కార్మికులంతా కలిసి ఐక్య పోరాటాలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ ప్రచారకార్యదర్శి క్రాంతికుమార్, సహాయ కార్యదర్శి ఎండీ ఖయ్యూం, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.
‘బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబ్‌నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ, రాజు యువశక్తి, ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు.

‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’