
పన్ను పాటలో సాగని ఆట
నరసాపురం: నరసాపురం మున్సిపల్ మార్కెట్ డైలీ పన్ను వసూళ్ల విషయంలో జనసేన నేతకు మేలు కలిగించేలా, మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడేలా కూటమి నేతలు వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. పైకి నిబంధనల ప్రకారం జరుగుతున్నట్లు చూపించి, గత ఏడాది కంటే ఏకంగా రూ.50 లక్షలకు పైగా తక్కువకు మార్కెట్ పాటను జనసేన నాయకుడికి కట్టపెట్టాలని మున్సిపల్ కమిషనర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది. అనుకున్న వారికి పాట కట్టబెట్టాలంటే కౌన్సిల్ తీర్మానం అవసరం. ఈ విషయంలో ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఇబ్బందనే భయంతో అధికారులు వెనక్కి తగ్గి మళ్లీ పాట నిర్వహించాలని నిర్ణయించారు. మున్సిపాలిటీ ఫుట్‌పాత్‌లు, రోడ్డు మార్జిన్ల వద్ద వ్యాపారాలు చేసే వారి నుంచి రోజువారీ పన్నుల వసూళ్లకు హక్కులు కోసం గతేడాది జరిగిన వేలంపాట రూ.83 లక్షలకు వెళ్లింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వారం క్రితం నిర్వహించిన పాటలో ఓ జనసేన నేత తన భార్య గంటా నాగదుర్గాదేవి పేరున రూ.30,06,000కు పాట దక్కించుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే రూ.50 లక్షలకు పైగా పాట తగ్గింది.
తెరవెనుక చక్రం తిప్పిన ఎమ్మెల్యే
ఎట్టి పరిస్థితుల్లో జనసేన నేతకు మార్కెట్ పాట అప్పగించి, మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టేందుకు ముందు నుంచి భారీ స్కెచ్ వేశారు. వేలం పాటకు ముందు మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులు నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే నాయకర్ వెళ్లి మార్కెట్ పన్ను ఎక్కువ కట్టవద్దని బహిరంగంగా చెప్పారు. దీంతో వేలంపాటదారులు భయపడ్డారు. ఎమ్మెల్యే చెప్పిన మాట ప్రకారం చూసుకుంటే పన్ను వసూళ్లు కష్టమవుతుందని కాంట్రాక్టర్లు భయపడి పాటకు మొగ్గుచూపలేదు. కమిషనర్ తక్కువ మొత్తానికి జనసేన నేతకు పన్ను నిర్వహణ అప్పగించడానికి మున్సిపల్ చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం బాధ్యత తనపై వేసుకుని కష్టపడ్డారు. మూడుపార్లు పాట వాయిదా వేసి, నాలుగో సారి జనసేన నేతకు రూ.50 లక్షలు తక్కువకు అప్పగించారు.
కౌన్సిల్ తీర్మానం అవసరంతో చిక్కు
పన్ను వసూళ్ల బాధ్యతలు అప్పగించాలంటే కౌన్సిల్ తీర్మానం అవసరం. మొత్తం 31 మంది కౌన్సిలర్లలో 25 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులున్నారు. గత ఏడాది కంటే భారీ మొత్తంలో పాట తగ్గడంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మొత్తం వ్యవహారం కమిషనర్, మున్సిపల్ రెవిన్యూ అధికారుల మెడకు చుట్టుకోవచ్చని భయపడ్డారు. దీంతో పాటను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ వసూలు చేసే పన్నులు కొంతమేర తగ్గిస్తామని పైకి వ్యాపారులను మభ్యపెట్టి ఆశలు చూపించి ఏకంగా మున్సిపాలిటీకి మార్కెట్ పాట ద్వారా ఏటా వచ్చే ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేయడం, అందులో స్వయంగా ఎమ్మెల్యే పరోక్షంగా ప్రయత్నించడం.. ఈ అంశంలో మున్సిపల్ కమిషనర్ నిబంధనలు వదిలి పెట్టడం చర్చనీయాంశమైంది.
కూటమి కార్యకర్తలా మున్సిపల్ కమిషనర్ వ్యవహారం
తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో చివరి నిమిషంలో వెనకడుగు
జనసేన నేతకు మేలు చేసే ప్రయత్నం
స్వయంగా నరసాపురం ఎమ్మెల్యే బెదిరింపుల పర్వం